ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోపాలెన్నో.. సహకరించని వాతావరణం!

author img

By

Published : May 10, 2021, 7:14 AM IST

farmers problems, grain purchase centers in telangana
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు, తెలంగాణ రైతుల సమస్యలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోపాల వల్ల అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధానపరమైన లోపాలతో పాటు సౌకర్యాల లోపం, వాతావరణ సమస్యల కారణంగా పంటను అమ్ముకోవడం గగనంగా మారిందని వాపోయారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క కేంద్రంలోనే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోపాలు, సమస్యల కారణంగా రైతులు అవస్థ పడుతున్నారు. ఈ కేంద్రాల నిర్వహణలో విధానపరమైన లోపాలతో పాటు, సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ మార్కెట్లకు మొక్కజొన్న, కంది, పత్తిలాంటి పంటలు రోజూ వేల బస్తాలొచ్చినా అదే రోజు కొనుగోలు చేసి రశీదు ఇచ్చి రైతులను పంపేస్తున్నారు. ధాన్యం విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. పైగా రాష్ట్రంలో ధాన్యం మార్కెట్లు 192 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 6,150 కొనుగోలు కేంద్రాలను రాష్ట్రమంతా ఏర్పాటుచేశారు. నెల క్రితం వీటిని ప్రారంభించినా ఇప్పటికీ 3.42 లక్షల మంది రైతుల నుంచి కొన్నది 25 లక్షల టన్నులే. లారీలు, టార్పాలిన్ల కొరతతో రోజుల తరబడి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా నేపథ్యంలో బిహార్‌ తదితర రాష్ట్రాల కూలీలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఈ సమస్య వేధిస్తోంది.

వాతావరణమూ సహకరించడం లేదు..


గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి పాడవుతోంది. పెద్ద వర్షం పడితే ధాన్యం మొత్తం నీళ్లలో నానుతోంది. తేమ ఉందని.. ధాన్యాన్ని ఆరబెట్టాలని కొనుగోలు కేంద్రాల్లో చెబుతుండగా.. అకాల వర్షాలు కురుస్తున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అంటోంది. మరోపక్క ఆరబోసిన ధాన్యం తడవకుండా పెద్దసంఖ్యలో టార్పాలిన్లు, ఇతర పరదాలు, తూకం యంత్రాలు సమకూర్చుకోవాలని మార్కెటింగ్‌శాఖ ఆదేశిస్తోంది. ఈ సూచనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేవారు లేకపోవడంతో సమస్యలతో రైతులు నష్టపోతున్నారు.

అన్నీ ఇబ్బందులే..


ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేక సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. 2 నుంచి 4 గ్రామాలకొక కొనుగోలు కేంద్రం ఉంది. ఏ రైతు ఏ రోజు ధాన్యాన్ని కేంద్రానికి తేవాలో పక్కాగా ముందుగానే చిట్టీ రాసిస్తున్నారు. ఇంత పక్కాగా లెక్కలున్నప్పటికీ ఆచరణలో ఒకట్రెండు రోజుల్లో ధాన్యాన్ని కొని తూకం వేసి రైతులను పంపలేకపోతున్నారు. తేమ అధికంగా ఉంటే ఎన్ని రోజులు ఆరబెట్టాలో అనే అంశాన్ని కచ్చితంగా చెప్పడం లేదు. లారీలు, టార్పాలిన్ల కొరత ఉంటే రైతులకు ఆ మాట చెప్పకుండా ధాన్యాన్ని ఆరబోయమని చెబుతున్నారనే ఫిర్యాదు ఉంది. ఆ ధాన్యం తడిసిపోతే తమకేం సంబంధమని రైతులు నిలదీస్తున్నారు. తూకం వేసినా లారీలో లోడ్‌ చేసి రైసుమిల్లుకు ధాన్యం వెళ్లేదాకా రైతులే దాని వెంట ఉండాలని, అక్కడ మరోసారి తూకం వేశాకే రశీదు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన తరవాత మిల్లు సిబ్బంది బస్తాకు 1 నుంచి 2 కిలోల తరుగు తీసుకుంటే ఆ నష్టాన్ని తమ ఖాతాలో వేయడం సబబా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మద్దతు ధర కోసమే..

మద్దతు ధరకు కొంటున్నారనే ఒకే ఒక్క కారణం చూపుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రతి క్షణం సతాయిస్తూ నష్టపరుస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదే ధాన్యాన్ని మద్దతు ధరకన్నా రూ.50 -రూ.100కు తక్కువకైనా ప్రైవేటు వ్యాపారికి అమ్ముకుంటే ఒక్కరోజులో తూకం పూర్తిచేసి నగదు ఇస్తున్నారని కొందరు రైతులు బయట అమ్ముకుంటున్నారు. ఈ కారణం వల్లనే కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు చెబుతున్నా ఇప్పటివరకూ అందులో అయిదో వంతుకు మించి కొనుగోలు చేయలేదు.

టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీం నంబర్లు ఏర్పాటు చేశాం. 1967 లేదా 180042500333కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. వనపర్తిలో రైతుల సమస్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం మాట్లాడారు. ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే ధాన్యం తరలించడానికి ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. తరుగు పేరుతో ధాన్యం తీసుకునే మిల్లర్లపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరాం.

- మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌

కూలీల కొరతతో ఇబ్బంది

- దామోదర్‌రెడ్డి, రైతు

నేను 4 ఎకరాల్లో వరి సాగుచేశా. 250 బస్తాల ధాన్యాన్ని మండల కేంద్రమైన బాలానగర్‌లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చా. కానీ అక్కడ కూలీలు లేరని ట్రాక్టర్లలో నుంచి ధాన్యం బస్తాలు దింపేవారు లేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. రోజూ వేల బస్తాలు ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాల వద్ద కూలీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

- దామోదర్‌రెడ్డి, శేరిగూడ, మహబూబ్‌నగర్‌ జిల్లా

అధిక తూకం వేసి మోసగిస్తున్నారు

సైదులు, రైతు

మా గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఒక్కో బస్తాలో 43 కిలోల ధాన్యం నింపుతున్నారు. బస్తాలో 40 కిలోల 700 గ్రాములకు మించరాదని ప్రభుత్వం చెప్పినా ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. 43 కిలోలు నింపడంతో బస్తా కుట్టే సమయంలో సరిగా రావడం లేదని కొంత ధాన్యాన్ని పక్కనపెట్టుకుంటున్నారు. దీనివల్ల బస్తాకు 2 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతు నష్టపోతున్నారు. ఈ కేంద్రంలో కనీసం మంచినీరు కూడా దొరకడం లేదు.

- సైదులు, రాయపర్తి, వరంగల్‌ గ్రామీణ జిల్లా

ఏ గ్రేడ్‌ అన్నా తిరస్కరిస్తున్నారు

చింతల రాజు, రైతు

నేను 119 బస్తాల ధాన్యాన్ని తొలుత తీసుకురాగా సాధారణ రకం వంగడం అని చెప్పి కొన్నారు. ఇప్పుడు అదే ధాన్యాన్ని మరో 20 బస్తాలు తెస్తే పొట్టిగింజలు అని చెప్పి కొనకుండా తిరస్కరిస్తున్నారు. రైతు ఎంత మంచి ధాన్యం తెచ్చినా సాధారణ రకం అని చెప్పి క్వింటాకు మద్దతు ధర రూ.1,868 మాత్రమే ఇస్తున్నారు. ఏ గ్రేడ్‌ అని రైతులు చెప్పినా క్వింటాకు మరో రూ.20 పెంచి ఇవ్వాల్సి వస్తుందని తిరస్కరిస్తున్నారు.

- చింతల రాజు, నంగునూరు, సిద్దిపేట జిల్లా

మంత్రి నియోజకవర్గంలోనే ఇలా..

తడిసిముద్దైన ధాన్యం

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గంలోని దొడగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రమిది. ఇక్కడ 5 వేల బస్తాల ధాన్యాన్ని కొని తూకం వేసినా లారీలు రాక వారం రోజులుగా ఉంచడంతో వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. టార్పాలిన్లు ఏర్పాటుచేయాలని మార్కెటింగ్‌ శాఖ ఆదేశాలిచ్చినా ఆ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే అమలు కాలేదు.

16 రోజులుగా పడిగాపులు

ఈరటి భోజన్న, రైతు

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ఈరటి భోజన్న. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్‌ గ్రామంలో మూడు ఎకరాల్లో వరి సాగుచేశారు. గత నెల 23న గ్రామంలోని ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం’(ప్యాక్స్‌)లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చారు. ఇప్పటికి 16 రోజులైనా ధాన్యం నింపడానికి గోనెసంచులు ఇవ్వలేదని, అప్పటి నుంచి ఇక్కడే పడిగాపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మొదట తేమ ఉందని చెప్పి ఆరబెట్టమన్నారు. ఆ తరవాత వర్షం పడటంతో తడిసింది. మళ్లీ ఆరబెట్టా. వర్షాల నుంచి కాపాడటానికి టార్పాలిన్లు ఇవ్వలేదు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలూ రావడం లేదు. అందుకని వేచి ఉండమంటున్నారు’’ అని తెలిపారు.

ఇదీ చదవండి: 50 వేల మంది సిబ్బందిని నియమించాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.