ETV Bharat / state

అన్నదాతలకు శుభవార్త... ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ!

author img

By

Published : Aug 6, 2021, 8:43 PM IST

Updated : Aug 6, 2021, 9:59 PM IST

2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేస్తోంది. ఈ నెల 16 నుంచి 50వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసే ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు ఈ నెల 16నుంచి... 2వేల 6 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 50 వేల వరకు రుణాల మాఫీ ప్రక్రియ నెలాఖర్లోపు పూర్తి చేయాలన్న మంత్రివర్గ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

TS NEWS: అన్నదాతలకు శుభవార్త... ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ!
TS NEWS: అన్నదాతలకు శుభవార్త... ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ!

రైతురుణమాఫీలో భాగంగా ఆగస్టు 16 నుంచి రూ.2006 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ అమలుపై 42 బ్యాంకుల ప్రతినిధులతో బీఆర్కే భవన్​లో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. 50 వేలలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్​లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతురుణాల మాఫీని లాంఛనంగా ప్రకటిస్తారని.. 16వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో 2006 కోట్ల రూపాయలు జమ అవుతాయని హరీశ్ రావు తెలిపారు.

బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో పనిచేసి రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలని మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి అర్హులని ఆ‌ సందేశంలో తప్పకుండా పేర్కొనాలని చెప్పారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు సందేశం పంపాలని హరీశ్ రావు అన్నారు.

రైతుల ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద‌ జమ చేయవద్దని, రైతులకు ఇబ్బందులు‌ సృష్టించవద్దని‌ స్పష్టం చేశారు. రుణమాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలని మంత్రి చెప్పారు. రైతు రుణమాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలని కోరారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణమాఫీ మొత్తం అందించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్​కు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు నిరంజన్​రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

రుణమాఫీ ఉత్తర్వులు జారీ

రైతు రుణమాఫీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 50 వేల వరకు రుణాల మాఫీ ప్రక్రియ నెలాఖర్లోపు పూర్తి చేయాలన్న మంత్రివర్గ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 పంటల రుణాల మాఫీ మార్గదర్శకాలకు అనుగుణంగా 50 వేల రూపాయల వరకు రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మాఫీ కోసం నిధులు విడుదల చేసింది. 1850 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 6, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.