పబ్‌లపై ఎక్సైజ్‌ ‘టాస్క్‌ఫోర్స్‌’.. నెల రోజులపాటు క్షేత్రస్థాయి తనిఖీలు

author img

By

Published : Apr 10, 2022, 5:37 AM IST

పబ్‌లపై ఎక్సైజ్‌ ‘టాస్క్‌ఫోర్స్‌’.. నెల రోజులపాటు క్షేత్రస్థాయి తనిఖీలు

Excise Department on Pubs: పబ్​లో కొకైన్ పట్టుబడటంతో ఎక్సైజ్‌శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాడిసన్ బ్లూ హోటల్​లో మద్యం అమ్మకాల అనుమతిని రద్దు చేసిన అధికారులు... మిగతా పబ్​ల పైనా నిఘా పెట్టారు. పబ్ యాజమాన్యాల వైఖరి మారకపోతే అవసరమైతే ప్రత్యేక జీవో తీసుకొచ్చి అన్నిటినీ రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నెల రోజుల పాటు పబ్​లలో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా గమనించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Excise Department on Pubs: రాజధానిలో పబ్‌ల పనితీరుపై ఎక్సైజ్‌శాఖ దృష్టిపెట్టింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనుంది. ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. రాడిసన్‌ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్‌లు నిబంధనల మేరకు నడుస్తున్నాయా? అనే అంశంపై ముఖ్యంగా పరిశీలన జరపనున్నారు. స్టార్‌ హోటళ్లలోని పబ్‌లను నిర్ణీత వేళలు మించి నడుపుతున్నారనే ఆరోపణలపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టిసారించనుంది. ఇలాంటి హోటళ్లలోని కొన్ని బార్ల నిర్వాహకులు 24 గంటలూ నడిపేందుకు పన్ను చెల్లించి అనుమతులు తీసుకుని వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్‌లను శుక్ర, శనివారాల్లో రాత్రి 1 గంటకు.. మిగిలిన రోజుల్లో 12 గంటలకు కచ్చితంగా మూసేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. బార్లలోనూ ఆ సమయం తర్వాత మ్యూజిక్‌, ఈవెంట్లు, డ్యాన్స్‌లు కొనసాగించకుండా ఆంక్షల అమలుపై దృష్టి పెట్టనుంది. పబ్‌ల్లోకి వినియోగదారులు మాదకద్రవ్యాల్ని వెంట తెచ్చుకున్నా నిర్వాహకులనే బాధ్యుల్ని చేయనున్నారు. ప్రవేశమార్గంలో వారిని తనిఖీ చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదే కావడంతో ఈ అంశంపై దృష్టి పెట్టనున్నారు.

పుడింగ్‌ పబ్‌లో అందరినీ బాధ్యులను చేయలేం: పబ్‌ల నిర్వాహకులు తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. పీడీ యాక్ట్‌తో పాటు నగర బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు. నగరంలోని 61 పబ్‌ల సీసీ కెమెరాలను ఎక్సైజ్‌ అధికారులకు అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించారు. పబ్‌లలో సర్వీస్‌ పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. పబ్‌ల నిర్వాహకులు, ఎక్సైజ్‌ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

‘‘డ్రగ్స్‌ విషయంలో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేదిలేదు. పుడింగ్‌ పబ్‌పై ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసుశాఖతో కలిసి దాడులు చేశాం. అక్కడ ఉన్నవారందరూ నిందితులు కారు. విందు కోసం వచ్చిన వారిని బాధ్యులను చేయలేం. విందు ఇచ్చిన వారిని, ఆహ్వానించిన వారినే నిందితులుగా గుర్తిస్తున్నాం’’ - శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర మంత్రి

మాదకద్రవ్యాల చట్టం కింద గత రెండు నెలల్లో రాష్ట్రంలో 192 కేసులు నమోదు చేసి 304 మందిని అరెస్టు చేశామని, 1290 కిలోల గంజాయి, 6.06 కిలోల హాష్‌ ఆయిల్‌, 11.7 గ్రాముల కొకైన్‌, 35 ఎల్‌సీడీ బాటిళ్లు సీజ్‌ చేశామని మంత్రి వివరించారు. పబ్‌ల వద్ద ఓ కానిస్టేబుల్‌ను ఉంచాలని నిర్వాహకులు కోరారు. సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పబ్‌లపై ఎక్సైజ్‌ ‘టాస్క్‌ఫోర్స్‌’.. నెల రోజులపాటు క్షేత్రస్థాయి తనిఖీలు

ఇదీ చదవండి: సూత్రదారుల ఆచూకీ ఎక్కడ!.. మత్తుమాఫియా ‘కీ’లక వ్యక్తుల కోసం వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.