ETV Bharat / state

Dr. Rakesh Mishra on omicron: జాగ్రత్తలు పాటించకపోతే మూడో ముప్పు తప్పదా..!

author img

By

Published : Dec 16, 2021, 11:38 PM IST

వేరియంట్లు..వేవ్‌లు..! రెండేళ్లుగా వీటితోనే పోరాటం చేస్తోంది ప్రపంచం. శాస్త్రవేత్తలు శ్రమించి టీకాలు తెచ్చినా.. వైరస్ రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే.. 55 దేశాలకుపైగా విస్తరించి వైద్య వ్యవస్థకు సవాలు విసురుతోంది. టీకాలు తీసుకున్నా రోగనిరోధక శక్తి వలయాన్నీ ఛేదించుకుని వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే డెల్టా విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రజలు ఒమిక్రాన్ ఏ ముప్పు మోసుకొస్తుందోనని వణికిపోతున్నారు. భారత్‌లోనూ కేసులు వెలుగు చూడటం..ఆందోళనను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ డెల్టా కంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా? ప్రభుత్వాలు టెస్టింగ్ ట్రేసింగ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది అన్న అంశాలపై వివరణ ఇచ్చారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాకేశ్ మిశ్రా. లక్షణాలు స్వల్పంగానే ఉన్నా జాగ్రత్తపడకపోతే మూడో అల ముంచుకు రావచ్చని అంటున్న డాక్టర్ రాకేశ్ మిశ్రాతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

Dr. Rakesh Mishra on omicron
డాక్టర్ రాకేశ్ మిశ్రాతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ప్ర. ఒమిక్రాన్‌ సోకిన వాళ్లలో లక్షణాలు కనిపించటం లేదు అంటున్నారు. దీనిని ఎలా చూడొచ్చు..?

జ. ఇది ఓ రకంగా సానుకూలమే. పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వెళ్లటం, ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడటం లాంటివి తప్పుతాయి. కానీ..అదే సమయంలో తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదమూ ఉంది. ఇప్పటికే వైరస్ సోకిందనో లేదా మరో వ్యక్తి నుంచి సోకుతుందనో భయంతోనో..వైరస్‌ను నియంత్రించాలన్న ఆలోచనతోనో మాస్క్‌ ధరిస్తే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎప్పుడైనా ముప్పు ముంచుకు రావచ్చు. లక్షణాలు క్రమంగా తీవ్రతరమై మరో వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉంది. అలా అయితే మనంతట మనమే శత్రువుని పెంచి పోషించినట్టవుతుంది.

ప్ర. ఇలా అయితే ప్రపంచం కరోనాపై గెలిచేదెప్పుడు..? నిత్యం నిస్సహాయ స్థితిలో ఉండాల్సిందేనా..?

జ. ఇది నిస్సహాయ స్థితి అనలేం. కాస్తో కూస్తో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. వ్యాక్సిన్, మాస్క్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. మైక్రోబ్యాక్టీరియాలే మనల్ని శాసిస్తున్నాయి. మన శరీరంలో కణాల కన్నా మైక్రో బ్యాక్టీరియాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలో కొన్ని ఎలాంటి ప్రభావం చూపించవు. మరికొన్ని జీర్ణప్రక్రియ సహా మరి కొన్ని అంశాల్లో మనకు ఉపకరిస్తాయి. కానీ కొన్ని మాత్రం క్రమక్రమంగా విస్తరిస్తూ సమస్యలు తెచ్చి పెడతాయి. వాటితో మనం అనారోగ్యానికీ గురవుతాం. సరైన వైద్యంతో వాటిని నిర్మూలించే అవకాశ ముంటుంది. ప్రస్తుతానికి ఇలాంటి హానికర మైక్రోబ్యాక్టీరియాల సంఖ్య పెరుగుతోంది. యాంటీ బాడీలు కూడా పని చేయని స్థాయిలో అవి పెరిగితే ప్రమాదమే. ఎప్పటి నుంచో మైక్రో బ్యాక్టీరియాలపై మన యుద్ధం కొనసాగుతోంది. కానీ..వైరస్‌ల విషయంలో ఇంత ఆందోళన లేదు. అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలుసుకోగలుగుతున్నాం. ఫంగస్, బ్యాక్టీరియాలాగా వైరస్‌లు ఎక్కువ సమయం పాటు ఈ వాతావరణంలో ఉండలేదు. వాటి జీవితకాలం గంటలు లేదా ఒకట్రెండు రోజుల వరకే పరిమితం. మాస్క్ ధరించి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటే ఏమీ కాదు. సులువుగానే వైరస్‌ను నియంత్రిచవచ్చు. మనం కాస్త క్రమశిక్షణతో ఉంటే అదేమంత సమస్య కాదు. లేదంటే ఇబ్బందులు తప్పవు. మన రోగనిరోధక శక్తి పెరుగుతున్న కొద్ది వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. కానీ..ఈ లోగా ఎన్ని ప్రాణాలకు హాని జరిగింది..? అనేదే కీలకం. ప్రభుత్వంతో పాటు...బాధ్యత గల పౌరులుగా..అందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాలి.

ప్ర. కరోనా వైరస్ క్రమంగా బలహీనమైపోయి..ఎండమిక్ దశకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒమిక్రాన్‌ వ్యాప్తి అందుకు సంకేతంగా భావించవచ్చా..?

జ. ఓ రకంగా ఇది నిజమే అనుకోవచ్చు. ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నా..ప్రభావం స్వల్పంగానే ఉంది. వైరస్ వ్యాప్తి చెందటానికి సరైన మాధ్యమం ఉండి తీరాల్సిందే. అలా అయితేనే వైరస్ మనుగడ సాగుతుంది. సింప్టమేటిక్‌గా మారినా ఎంత మందికి సోకి ప్రమాదకరంగా మారిందనేదే కీలకం. లక్షల కొద్ది మైక్రోబ్యాక్టీరియాల్లో క్రమంగా ఇది కూడా చేరిపోవచ్చు. ప్రభావం తగ్గుతున్నా వ్యాప్తి చెందే గుణం మాత్రం ఉంటుంది. ఎప్పటికప్పుడు తీరు మార్చుకుంటూ ఉంటుంది. సాధారణ జలుబు, దగ్గులాగా వచ్చి పోతుండొచ్చు. కానీ అది జరిగే వరకు ఎదురు చూడకూడదు. ఈ స్థితికి చేరుకోవటానికి చాలా సమయం పడితే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. తక్షణమే అయితే మాత్రం మళ్లీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే పరిస్థితులొస్తాయి. మనల్ని మనమే సంరక్షించుకుంటే వైరస్‌పై విజయం సాధించవచ్చు.

ప్ర. మనం అనుసరిస్తున్న టెస్టింగ్ విధానం సరైందేనా..? ఎట్‌ రిస్క్ దేశాల నుంచి వచ్చే వాళ్లనే పరీక్షిస్తున్నాం. కానీ..ఎట్‌ రిస్క్‌ కాని దేశాల నుంచీ ఇక్కడికి వస్తున్నారు. విదేశీ ప్రయాణికులను ఎలా పరీక్షించాలి..? వారిలో కేవలం 2% మందినే టెస్ట్ చేయటాన్ని ఎలా చూడాలి..?

జ. ఇలాంటి విధానాల వల్లే వైరస్ వ్యాప్తి అధికమవుతుంది. ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి అనుమానితులను పరీక్షించాలి. హైరిస్క్, లోరిస్క్ దేశాల వారిని, వ్యాక్సిన్ తీసుకోని వారిని టెస్ట్ చేయాలి. అందరినీ స్కాన్ చేస్తూ పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు పంపాలి. కానీ...టెస్ట్‌లు పరిమితంగానే జరుగుతున్నాయి. విదేశీ ప్రయాణికులపై నిఘా ఉంచుతున్నాం సరే. కానీ చాలా దేశాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ విస్తరించింది. వేరియంట్‌ వ్యాప్తిని నిలువరించలేం. వ్యాప్తి చెందితేనే ఏ వేరియంట్‌ గురించైనా తెలిసేది. కానీ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలుసుకోలేం. ఓ వ్యక్తి నుంచి కొంత మందికే వ్యాప్తి చెందిందా..ఎక్కువ మందికి సోకిందా లక్షణాలేంటి అన్నది అర్థమయ్యాకే కొత్త వేరియంట్ వచ్చిందని తెలుస్తుంది. ఇలాంటప్పుడు.. సీక్వెన్సింగ్ చేయటమూ కీలకమే. టెస్ట్ చేసిన ప్రతి వారి వైరస్ నమూనాలను సీక్వెన్సింగ్ చేయాలి. కొత్త వేరియంట్‌ను కనుగొనటం అంత సులువు కాదు. ఎంతో నిఘా ఉంచితే తప్ప ఎక్కడి నుంచి విస్తరించింది అన్నది అర్థం కాదు. ఈ స్థాయిలో నిఘా ఉంచటం చాలా అరుదు. చాలా వరకు వేరియంట్‌లు నిఘా వ్యవస్థ కళ్లుగప్పి వ్యాప్తి చెందుతాయి. ఇంత జనాభా ఉన్న భారత్‌లో రవాణా ఆంక్షలపైనే దృష్టి పెట్టటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. విమానాలు అని కాకుండా ఇతర మార్గాల్లోనూ చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు. డెల్టా లాంటి వేరియంట్‌లు గంటలోనే వ్యాప్తి చెందటాన్ని గమనించాం. ఈ వ్యాప్తి వేగాన్ని ఎలా నియంత్రించాలన్న అంశంపై అధ్యయనం చేయాలి. అప్పుడే ఎండమిక్ దశకు చేరుకోగలం. అందుకే..పరీక్షల సంఖ్య పెంచటం, జీనోమ్ సీక్వెన్సింగ్ పంపి..బాధితులను క్వారంటైన్‌ చేయటం పక్కాగా జరగాలి.

ప్ర. విదేశీ ప్రయాణికులు తమ దేశం నుంచి బయలుదేరే 72 గంటల ముందు కరోనా నెగటివ్‌గా నిర్ధరణ అవుతోంది. కానీ.. గమ్యస్థానానికి చేరుకున్నాక పరీక్షిస్తే పాజిటివ్‌గా మారుతున్నారు. ఎందుకిలా?

జ. కరోనా టెస్ట్ చేయించుకున్న రోజు నెగటివ్‌ వచ్చిందని అనుకుందాం. మరుసటి రోజు అదే వ్యక్తి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా తిరిగితే వైరస్ సోకుతుంది. లక్షణాలు బయటపడటానికి మూడు, నాలుగు రోజులు పడుతుంది. ఆ సమయానికే వాళ్లు భారత్‌కు చేరుకుంటున్నారు. అంటే వాళ్లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కరోనా నెగటివ్‌ కాదని అర్థమవుతోంది. విదేశీ ప్రయాణికులకు నెగటివ్‌ వచ్చాక మూడు రోజుల వరకు బయటకు వెళ్లకుండా ఉంటే.. భారత్‌కు వచ్చాక కూడా నెగటివ్‌గా నిర్ధరించగలం. మొదటి సారి టెస్ట్ చేయించు కున్నప్పుడు వైరస్ ఉండకపోవచ్చు. వైరస్ సోకిన రోజే టెస్ట్ చేయించుకున్నా పెద్దగా తెలియక పోవచ్చు. శరీరంలో వ్యాప్తి చెందటానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అప్పుడు పాజిటివ్ వస్తుంది. టెస్ట్ చేసిన వారిలో 80% మందికే సరైన రిపోర్ట్ వస్తోంది. 10-15% మందిలో వైరస్ ఉన్నా అది చిక్కటం లేదు. అందుకేపెద్ద మొత్తంలో టెస్ట్‌లు చేస్తూ ఉండాలి. వ్యక్తిగతంగానూ బాధ్యతగా ఉండాలి. మన రోజువారీ కార్యకలాపాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో గమనించుకోవాలి. ఇది మన జీవనశైలిలో భాగమవ్వాలి. అప్పుడే వైరస్‌పై పైచేయి సాధించగలం. టెస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రామాణిక విధానమంటూ లేదు.

డాక్టర్ రాకేశ్ మిశ్రాతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ప్ర: బూస్టర్‌ డోసు మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇండియాలో బూస్టర్‌ డోసు అవసరం ఉందని అంటారా?

జ: ఇప్పుడే ఆ అవసరం లేదు. బూస్టర్‌ డోసు వల్ల రక్షణ పెరుగుతుంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో అది సహాయ పడుతుంది. అయితే ఒకరికి బూస్టర్‌ డోసు ఇవ్వడం కంటే అసలు ఒక్కడోసు కూడా వ్యాక్సిన్‌ వేయని వారికి మొదటి డోసు వేయడం ఇప్పుడు ముఖ్యం. అందుకనే మొదటి అందరికీ టీకా అందించడం మన వ్యూహంగా ఉండాలి. తర్వాత బలహీనంగా ఉన్న వారికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, వైరస్ ముప్పు అధికంగా ఉన్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలి. కావాల్సినంత వ్యాక్సిన్ డోసులు ఉండి.. రోజులో ఎంతమందికి, ఎన్ని డోసులు అయినా అందించగల స్థాయిలో ఉంటే బూస్టర్‌ డోసులకు వెళ్లవచ్చు. కానీ ఇక్కడా పరిస్థితి లేదు. అందుకే మొదట ఇంకా అందని వారికి టీకాలు వేయాలి. వ్యాక్సినేషన్ అనేది ఒక సామాజికాంశం. కొద్దిమందికి అత్యంత రక్షణ కల్పించి.. మిగిలిన వారికి ఎలాంటి రక్షణ లేకపోతే.. మొదటి రక్షణ పొందిన వారికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంమంతా మాట్లాడు తున్న వ్యాక్సిన్‌ అసమానత అంటే ఇదే. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే రోగనిరోధకశక్తి సరిగా లేకపోతే బూస్టర్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే సాధారణ ప్రజలు అందరికీ బూస్టర్‌ డోసు గురించి ఆలోచించడం అనవసరం.

ప్ర: మురుగునీటి కాల్వల నుంచి నమునాల సేకరణ అవసరం ఏమిటి? గతంలో సీసీఎంబీ కూడా సీవేజ్ వాటర్ సర్వేలు చేసింది. రానున్న రోజుల్లో అలాంటి సర్వేలు మళ్లీ చేస్తారా?

జ: అందుకు కావాల్సిన సాంకేతికత అందుబాటులో ఉంది. చాలా నగరాల్లో వేర్వేరు విధానాల్లో సీవేజ్ సర్వేలు చేస్తున్నారు. బెంగళూరులో నాలాల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషణల ఆధారంగా అంచనాలు రూపొందిస్తున్నారు. అక్కడి సీవేజ్ బోర్డు వారం వారం నమూనాలు అందిస్తోంది. వాటిని పరీక్షించి సీరో పాజిటివిటీ రేటుని పరిశీలిస్తున్నాము. పుణెలో కూడా మేం ప్రణాళికాబద్ధంగా ఆ సర్వేలు చేస్తున్నాము. మరిన్ని నగరాల్లో ఈ సర్వేలు జరగాలి. అది చాలా ఉపయోగకరం. తెలుగురాష్ట్రాల్లో కొంతమేర ఆ ప్రయత్నం జరుగుతోంది. అయితే నిరంతరాయంగా పెద్ద ఎత్తున ఈ మురుగునీటి నమూనాల సేకరణ, విశ్లేషణ చేపట్టాలి. వాటిల్లో ఏమైనా కొత్త వేరియంట్లు వచ్చాయా అని చెప్పే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఏదైనా ఒక వేరియంట్ 5%కంటే ఎక్కువమందికి సోకితే అది మురుగునీటి నమూనాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా మురుగునీటిపై నిఘా, నమూనాల విశ్లేషణ మంచి ఫలితాలు ఇస్తోంది. భారత్‌లో కూడా అది చేపడితే మంచిది.

ప్ర. టెస్టింగ్‌, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ప్రజలకు, అధికారులకు మీరిచ్చే సలహాలు, సూచనలేంటి..?

జ. టెస్టింగ్, ట్రేసింగ్‌. వైరస్‌కు ముకుతాడు వేసేది ఈ రెండే. ఓ వ్యక్తి నుంచి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకో గలిగితే అదే మన మొదటి విజయం. మరొకరికి సోకకుండా నియంత్రించగలిగితే వైరస్‌ ప్రభావాన్ని తగ్గించటం పెద్ద కష్టమేమీ కాదు. తక్కువ కాలంలోనే ఇది సాధించగలం. టెస్టింగ్ చేశాక ట్రేసింగ్‌లోనూ జాగ్రతగా వ్యవహరించాలి. బాధితుడితో కాంటాక్ట్‌లో ఎవరెవరున్నారో అప్రమత్తం చేసి క్వారంటైన్‌ చేయాలి. నిత్యం నిఘా ఉంచుతూ..జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియనూ వేగవంతం చేయాలి. తద్వారా కొత్త వేరియంట్ రాకముందే మనం జాగ్రత్తపడే అవకాశముంటుంది. టెస్ట్‌, ఐసోలేట్, ట్రేస్ ద్వారా వ్యాప్తి ఆపవచ్చు. అదే సమయంలో సామూహిక కార్యక్రమాలనూ తగ్గించు కోవాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోకపోతే..అది మరో ఆర్థిక, ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తుంది. క్రమశిక్షణతో ఉండాలి. టెస్టింగ్‌, ట్రేసింగ్, సీక్వెన్సింగ్, వ్యాక్సినేషన్‌...అనేవి ప్రభుత్వ బాధ్యతలు. మాస్క్ ధరించటం, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించటం, గుమిగూడకుండా ఉండటం లాంటివి పౌరుల బాధ్యతలు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ యుద్ధాన్ని గెలవగలం. ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుందన్న ఆలోచన సరికాదు. పాండెమిక్‌ అనేది సామాజిక సమస్య. అందుకే.. సామాజిక మార్పులతోనే ఈ ముప్పు నుంచి బయటపడగలం.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.