ETV Bharat / state

భాగ్యనగరంలో రెచ్చిపోతున్న శునకాలు.. వణికిపోతున్న నగరవాసులు

author img

By

Published : Feb 14, 2023, 9:45 AM IST

Dog attacks increases in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా ఎగబడుతున్నాయి. వీధుల్లో స్వైరవిహారం చేస్తూ పెద్దలపై ముఖ్యంగా చిన్నారులపై దాడులు చేస్తూ రెచ్చిపోతున్నాయి. మేడ్చల్‌ జిల్లా కోంపల్లి మున్సిపాలిటీలోని వీటి బెడద తారస్థాయికి చేరింది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 50 ఘటనలు జరిగాయి. పెద్దలు వారి పనులకు వెళ్లాలన్నా, పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్న శునకాలతో సావాసం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.

Dogs
Dogs

భాగ్యనగరంలో రెచ్చిపోతున్న శునకాలు.. దాడులతో వణికిపోతున్న నగరవాసులు

Dog attacks increases in Hyderabad : కుక్కల బెడదతో హైదరాబాద్ ప్రజలు హడలెత్తిపోతున్నారు. బయటకు వెళ్తే ఏ కుక్క కరుస్తుందోనని వణికిపోతున్నారు. కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుక్కలు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఏడాది కాలంలోని దాదాపు 50 పైగా కుక్కల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఏడో తరగతి చదువుతున్న ప్రణీత్‌రెడ్డి రాత్రి ట్యూషన్‌ నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా... శునకాలు వెంటపడి దాడి చేయడంతో వైద్యులు అతనికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏడాది కాలంలో 50 ఘటనలు : గత నెలలో శాన్వి అనే అమ్మాయిపైనా ఇలాగే దాడి చేశాయి. శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన 5 ఏళ్ల తునుశ్రీ దుకాణానికి వెళ్లింది. ఆమె తిరిగి వస్తున్న సమయంలో సుమారు 5 కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చగా చేతిలోని నరాలు దెబ్బతిని ఇన్ఫేక్షన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఇలా ఏడాది కాలంలోనే దాదాపు 50 ఘటనలు జరిగాయంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

బయటకి వెళ్లాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే : కుక్కల బెడదతో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది తమ పిల్లల్ని ట్యాషన్‌ కూడా మాన్పించేశారు. మరికొంత మంది ద్విచక్రవాహనంపై తీసుకెళితే వెంట పడుతున్నాయిని.. కార్లలో తీసుకెళ్లి దిగబెడుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చిన్నారుల్ని స్కూల్‌ వ్యాన్ ఎక్కించేందుకు వెళ్లినా చేతిలో కర్ర తప్పనిసరిగా మారింది. శునకాల భయంతో ఆదివారం వచ్చినా పిల్లలు బయట స్వేచ్ఛగా ఆడుకునేందుకు అవకాశం ఉండటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో ఎక్కువగా దాడులు : కొంతమంది దగ్గర్లోని పార్క్‌కు స్వయంగా తీసుకెళ్లి చుట్టూ కాపలా కాస్తూ వారిని ఆడిస్తున్నారు. విపరీతంగా సంచరిస్తున్న శునకాల భయంతో పార్క్ వద్దకు కూడా నడిచి రాలేని పరిస్థితి నెలకొనడంతో... కార్లలోనే పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న శునకాల భయంతో చిన్నిప్పటి నుంచే వారి మనసులో భయం ఉండిపోతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కోంపల్లి మున్సిపాలిటీలోని 5, 9, 10,12, 13 వ వార్డుల్లో కుక్కల బెడదతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలనీల్లో సుమారు 500 కుక్కలు సంచరిస్తున్నాయని... రాత్రి వేళల్లో ఎక్కువగా దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కుక్కల దాడులు పెరిగిపోవడంతో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారులు మాత్రం కొన్నింటినే తీసుకెళ్లి వాటికి సంతానోత్పత్తిని నియంత్రించే చికిత్స చేసి మళ్లీ కాలనీల్లో వదిలేస్తున్నారని వాపోతున్నారు. వాటి బెడద నుంచి తప్పించుకునేలా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.