ETV Bharat / bharat

మందుబాబులకు వింత శిక్ష.. స్టేషన్​లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్.. ఏం రాయించారంటే..

author img

By

Published : Feb 13, 2023, 6:36 PM IST

Updated : Feb 13, 2023, 7:05 PM IST

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కేరళ పోలీసులు వినూత్న శిక్ష విధించారు. కొచ్చిలో మందుబాబులను పోలీస్ స్టేషన్​లో కూర్చోబెట్టి "ఇకపై తాగి డ్రైవింగ్ చేయను" అని 1000 సార్లు రాయించారు.

Kerala police imposition
మందుబాబులకు వింత శిక్ష

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. మందు కొట్టి డ్రైవింగ్ చేస్తున్న వారితో.. పాఠశాల విద్యార్థుల తరహాలో ఇంపోజిషన్​ రాయించారు. త్రిపునితుర పోలీసులు ఈ వింత శిక్ష వేశారు. "ఇకపై తాగి డ్రైవింగ్ చేయను" అని మందుబాబులతో వెయ్యిసార్లు రాయించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు కొచ్చి నగరంలో పోలీసులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వారికి ఈ శిక్ష విధించారు.

మందుబాబులంతా చేసేది లేక పోలీస్ స్టేషన్​లో నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాశారు. పెన్ను, పేపరు పట్టుకుని.. పోలీసులు చెప్పినట్టే "ఇకపై తాగి డ్రైవింగ్ చేయను" అని వెయ్యి సార్లు రాశారు. అయితే.. మద్యం మత్తులో వాహనాలు నడిపినవారు ఇలా వెయ్యి సార్లు రాసినా.. వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు అంటున్నారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు. పోలీసులకు చిక్కినవారి జాబితాలో 12 మంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, ఇద్దరు కేఎస్ఆర్టీసీ డ్రైవర్లు, ఇద్దరు స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఉన్నారు.

Kerala police imposition
స్టేషన్​లో ఇంపోజిషన్​ రాస్తున్న మందుబాబులు

ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు.. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు దుర్మరణం చెందాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయినా.. కొందరు వ్యక్తులు అక్రమంగా వాహనాలు నడుపుతున్నట్లు ఈ డ్రంకెన్ డ్రైవ్​లో పోలీసులు గుర్తించారు. ఇలా అక్రమంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొచ్చి సిటీ పోలీసులు స్పష్టం చేశారు.

Last Updated : Feb 13, 2023, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.