ETV Bharat / state

రాళ్లు రప్పల మార్గంలో శ్రీవారి దర్శనం

author img

By

Published : Oct 7, 2020, 6:41 PM IST

కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అధునికీకరణలో భాగంగా అలిపిరి కాలినడక మార్గంలో నిర్మాణాలు చేపట్టడం వల్ల తిరుమల వెళ్లే భక్తులు రాళ్లు రప్పల్లో నడవాల్సి వస్తోంది. ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు లేకుండా కాలినడక మార్గంలో పైకప్పు కూల్చివేస్తుండటం వల్ల మొక్కులు తీర్చుకొనేందుకు నడచి వెళ్తున్న భక్తులకు సమస్యలు ఎదురవుతున్నాయి. వయసు పైబడినవారు, మహిళలు ఎగుడుదిగుడుగా ఉన్న రాళ్ల మధ్య నడవలేకపోతున్నారు.

రాళ్ల రప్పల మార్గంలో శ్రీవారి దర్శనం
రాళ్లు రప్పల మార్గంలో శ్రీవారి దర్శనం

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిలయన్స్‌ సంస్థ విరాళంతో అలిపిరి కాలినడక మార్గాన్ని ఆధునికీకరించడానికి తితిదే చర్యలు చేపట్టింది. రూ.25 కోట్లతో చేపట్టిన కాలినడక మార్గ అభివృద్ధి పనులను ఇటీవలే తితిదే ప్రారంభించింది.

ఓ వైపు భక్తులు.. మరోవైపు నిర్మాణాలు..

తిరుపతి అలిపిరి తనిఖీ ప్రాంతం నుంచి కాలినడక మార్గంలో ఉన్న పైకప్పు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భక్తులను కాలినడక మార్గంలో అనుమతిస్తూనే మరోవైపు నిర్మాణాలు చేపట్టడం వల్ల సమస్యగా ఉంది. పైకప్పు కూల్చివేత పనులు సాగుతున్నందున శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను దారి మళ్లిస్తున్నారు. భద్రతా సిబ్బంది ద్వారా కాలినడక మార్గం పక్కనే ఉన్న కొండదారిలో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. రాళ్లు రప్పలతో కూడిన ప్రాంతంలో భక్తులు నడవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం లేక భక్తుల ఇబ్బందులు

కాలినడక మార్గంలో నిర్మాణాలు జరుగుతున్న సమచారం భక్తులకు తెలిసేలా ప్రారంభంలో ఎలాంటి బోర్డులు ఏర్పాట్లు చేయలేదు. కాలినడకన తిరుమల యాత్ర ప్రారంభించిన భక్తులు కొంత దూరం వెళ్లాక నిర్మాణాలు జరుగుతున్న తీరు.. కొండ మార్గంలో నడవాల్సి రావడాన్ని గుర్తిస్తున్నారు. అప్పటికే కొంత దూరం ప్రయాణించాక రాళ్లు రప్పల్లో నడవలేక.. వెనక్కు తిరిగి వెళ్లలేక సతమతమవుతున్నారు. అలిపిరి ప్రారంభంలో రహదారి నిర్మాణంలో ఉన్న సమాచారాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు పడేవారం కాదని భక్తులు అంటున్నారు.

ఎలాంటి ప్రకటన లేకుండా నిర్మాణాలు

కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. కాలినడకన వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని భావించి.. తితిదే ఎలాంటి ప్రకటనలు లేకుండా కాలినడక మార్గ నిర్మాణాలను ప్రారంభించింది. మూడు వందల రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఇటీవల కాలంలో కాలినడకన అధిక సంఖ్యలో తిరుమల వస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: సడలుతున్న కరోనా భయం.. తిరుమలకు పోటెత్తుతున్న భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.