ETV Bharat / state

ధరణి.. కుమారులకే బహుమతి..!

author img

By

Published : Nov 11, 2020, 8:52 AM IST

మెదక్‌ జిల్లాకు చెందిన రైతు రామారావు తన భార్యకు ఎకరా భూమిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుని ధరణి పోర్టల్లో స్లాట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం వచ్చే ధ్రువీకరణ పత్రాల్లో హోదా వద్ద భార్యకు బదులుగా కుమారుడు అని నమోదైనట్టు రైతు గుర్తించారు. ఇదేమని ఆరా తీయగా, పోర్టల్లో భార్య అనే ఐచ్ఛికం లేదని, ఎవరి పేరు నమోదు చేసినా కుమారుడు అనే వస్తోందని అధికారులు తెలపడంతో ఆయన అవాక్కయ్యారు.

dharani
dharani

ధరణి పోర్టల్‌ ద్వారా అందిస్తున్న సేవల్లో గిఫ్ట్‌డీడ్‌ ప్రక్రియ ప్రస్తుతం అందులోని లోపాలను ఎత్తిచూపుతోంది. కుటుంబంలోని సభ్యుల పేరుతో కొంత భూమిని బహుమతి కింద రిజిస్టర్‌ చేసేందుకు స్టాంపు రుసుం, చలానా చెల్లించి ధరణిలో స్లాటు నమోదు చేసుకుంటున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవంగా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరున రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయితే, సంబంధిత పత్రాల్లో వారి హోదా నమోదు కావాలి. దీనికి భిన్నంగా కుమారుడు అనే ఐచ్ఛికం ఒక్కటే కనిపిస్తోంది. ధరణి పోర్టల్లో వివరాలు మార్చే అవకాశంగానీ, అధికారంగానీ తమకు లేకపోవడంతో భూ యజమానులకు సమాధానం చెప్పలేకపోతున్నామని, వారి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నామని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు.

నిజమో? కాదో? నిర్ధారించేదెలా?

ధరణి ఫోర్టల్‌ ద్వారా భూ కొనుగోలు (సేల్‌), బహుమతి (గిఫ్ట్‌) ఇచ్చే భూయజమాని వేర్వేరుగా రుసుంలు చెల్లించాల్సి ఉంటుంది. స్లాటు నమోదు సమయంలో ఆన్‌లైన్‌లో పేర్కొనే వివరాలు, సేవల ఆధారంగా ధరణి పోర్టల్‌ దానంతట అదే రుసుం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు సేల్‌ డీడ్‌ అని స్లాట్‌ నమోదు చేస్తే భూమి మార్కెట్‌ విలువలో స్టాంపు డ్యూటీ 4 శాతం, భూ హక్కుల బదలాయింపు (ట్రాన్స్‌ఫర్‌) రుసుం 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ రుసుం 0.5 శాతంగా లెక్కగట్టి మొత్తం ఆరు శాతం చెల్లించాలని సాఫ్ట్‌వేర్‌ తెలియజేస్తుంది. అదే గిఫ్ట్‌డీడ్‌కు అన్నీ కలిపి రుసుం రెండు శాతంగా తెలియజేస్తుంది. ఈ రెండు సేవలకు కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే బహుమతిగా ఆస్తి పొందే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి కుటుంబ సభ్యుడా? కాదా? అని ధ్రువీకరించే అవకాశం అధికారులకు ఉండదు. ‘ఇది క్రయ, విక్రయదారులకు రక్త సంబంధం లేకపోయినప్పటికీ గిఫ్ట్‌డీడ్‌ కింద ఆస్తులు రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. తద్వారా రెండు శాతం రుసుంతో ఎక్కువమంది ఆస్తులు రిజిస్టర్‌ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గిస్తున్నారు’ అని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.