ETV Bharat / state

డిగ్రీ విద్య ప్రక్షాళన.. ఆ కోర్సులపై విద్యామండలి ఫోకస్

author img

By

Published : Oct 16, 2022, 7:22 AM IST

డిగ్రీ విద్యను ప్రక్షాళన చేసే దిశగా.. ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. కొత్త కోర్సులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఉన్నత విద్య మండలి ఛైర్మన్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన విశ్వవిద్యాలయ ఉపకులపతుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Degree Education Purgatory in telangana
డిగ్రీ విద్య ప్రక్షాళన.. ఆ కోర్సులపై విద్యామండలి ఫోకస్

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అధ్యయనం చేసి ఉపాధి అవకాశాలు పెంచే మరిన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మండలి కార్యాలయంలో శనివారం జరిగిన ఆరు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీ కోర్సుల పాఠ్య, విద్యా ప్రణాళికలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు, ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఓయూ, శాతవాహన, మహాత్మాగాంధీ ఉపకులపతులు రవీందర్‌, మల్లేష్‌, గోపాల్‌రెడ్డిలతో ఓ కమిటీని నియమించారు. రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో క్రెడిట్లు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం నేపథ్యంలో.. దానిపైనా కమిటీ అధ్యయనం చేయనుంది.

ఆ కమిటీ డిసెంబరు నాటికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నాటికి ఆయా కోర్సులు, సిలబస్‌ తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తామని విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. ప్రైవేట్‌, డీమ్డ్‌ వర్సిటీలు డిగ్రీలో ఎటువంటి కోర్సులను ప్రవేశపెడుతున్నాయి? వాటికి డిమాండ్‌ ఎలా ఉంది? తదితర అంశాలన్నిటినీ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో బీఎస్సీ డేటా సైన్స్‌, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌, బీఏ ఆనర్స్‌, ఈ ఏడాది బీఎస్సీ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టామని, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. పీజీ మొదటి సంవత్సరం తొలి సెమిస్టర్‌ తరగతులను ఈ నెల 31 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, తెలంగాణ, పాలమూరు వర్సిటీల వీసీలు రవీందర్‌ గుప్తా, లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ వినియోగాన్ని నివారించేందుకు.. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు, డ్రగ్స్‌ వాడకాన్ని నిరోధించేందుకు వర్సిటీల స్థాయిలో 2 క్రెడిట్లు ఉన్న కోర్సులను ప్రవేశపెడతారు. డిగ్రీ విద్యార్థుల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలు, ఇతర నిపుణులను ఆహ్వానించి వచ్చే నెలలో చర్చించాలని నిర్ణయించారు. ఇందుకు టీసీఎస్‌ సహకారం తీసుకుంటారు. మూల్యాంకనం, విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు నూతన విధానాలపై అధ్యయనానికి త్వరలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఒప్పందం కుదుర్చుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.