ETV Bharat / state

Telangana Rains LIVE UPDATES : రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు : వాతావరణ శాఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 11:51 AM IST

Updated : Dec 5, 2023, 4:28 PM IST

Heavy Rains in Telangana
Cyclone Michaung Effect in Telangana

Cyclone Michaung Effect in Telangana : మిగ్​జాం తుపాను​ కారణంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను ప్రభావం తెలంగాణలో ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్​జాం తుపాను ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఉంటుందని హెచ్చరించింది.

4.20PM

తీరం దాటిన తుపాను

తీరం దాటిన తీవ్ర తుపాను మిగ్‌జాం. ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 2 గంటల్లో తుపానుగా మిగ్‌జాం బలహీనపడనున్నది. అనంతరం 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనున్నది. తుపాను తీరం దాటినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

04.05 PM

జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్

ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితులపై ఆరా తీశారు. టెలికాన్ఫరెన్స్​లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్​కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు.

నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వే, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని శాంతి కుమారి అధికారులను సూచించారు.

01.38 PM

రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతిభారీ నుంచి- అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.

01.11 PM

వర్షంలో తడుచుకుంటు స్వామివారిని దర్శించుకున్న భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గము వ్యాప్తంగా పలు మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావంతో రోడ్లపై జనజీవనం స్తంభించింది. వాతావరణంలోని మార్పుల కారణంగా వాతావరణం చల్లగా మారింది.

12.51 PM

18 విమాన సర్వీసులు రద్దు

తుపాను ప్రభావంతో రాజమండ్రి విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే 18 సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

12.39 PM

తుపాను​ ఎఫెక్ట్​- పలు రైళ్లు రద్దు

మిగ్​జాం తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేశామన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్ల రద్దు ఉంటుందని పేర్కొన్నారు.

12.35 PM

హైదరాబాద్​లో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. నిరంతరాయగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. ఈదురు గాలులు కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్​ తదితర ప్రాంతాల్లో రహదారులలో నీరు చేరింది. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు.

11.45 AM

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్ష సూచన దృష్ట్యా రాహుల్‌ బొజ్జా సమీక్ష

రాష్ట్రంలో మిగ్​జాం తుపాను​ ప్రభావం చూపిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్లతో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబ్‌బాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఇవాళ, రేపు భారీ వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాహుల్‌ బొజ్జా కలెక్టర్లుకు సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత చర్యలు చేయాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

10.45 AM

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు

తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, భద్రాచలం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.

అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, దమ్మపేట, కూసుమంచి, కారేపల్లి , పాల్వంచ, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్‌ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

10.33 AM

నల్గొండ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, దేవరకొండలో వర్షాలు

నల్గొండ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, దేవరకొండలో వర్షాలు పడుతున్నాయి.

09.55 AM

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, రాయదుర్గం, బహదూర్‌పల్లి, సూరారం, మియాపూర్, చందానగర్, మాదాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ,మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట్‌, మేడ్చల్‌లో వర్షం జోరుగా పడుతోంది.

కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, బోరబండ, అల్లాపూర్, రహమత్‌నగర్, మధురానగర్‌, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మైత్రివనం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Last Updated :Dec 5, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.