ETV Bharat / state

నగ్నంగా మాట్లాడుతుంది.. లక్షలకు లక్షలు కొట్టేస్తుంది..!

author img

By

Published : May 19, 2020, 10:01 AM IST

వాట్సప్‌లో మీకు పరిచయం లేని నంబర్ల నుంచి వీడియో కాల్‌ వస్తే జాగ్రత్త.. మీరు హలో అనగానే.. అటువైపు నుంచి నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి హాయ్‌.. అంటూ పలకరిస్తుంది.. లాక్‌డౌన్‌లో నేను ఇలాగే ఉంటున్నా.. మీరూ ఇలాగే ఉంటున్నారా? అంటూ మాటలు కలుపుతుంది. ఇది బాధితుల నుంచి రూ.లక్షలు కొట్టేసేందుకు సైబర్‌ నేరస్థులు ప్రయోగిస్తున్న తాజా మాయాజాలం.

cyber-crimes-through-unknown-whatsapp-video-call
నగ్నంగా మాట్లాడుతుంది.. లక్షలకు లక్షలు కొట్టేస్తుంది..!

వాట్సప్‌లో మీకు ఓ వీడియో కాల్ వస్తుంది. మీరు లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి పలకరిస్తుంది. ఇది బాధితులకు వల వేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు సైబర్​ నేరస్థుల నయా టెక్నిక్. ఆ అమ్మాయితో మీరు చేసిన సంభాషణను స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి పలువురి నుంచి డబ్బు గుంజుతున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ తమకు వచ్చాయంటూ హైదరాబాద్‌కు చెందిన 40 మంది సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు బురిడీ

సికింద్రాబాద్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు వారం క్రితం వీడియోకాల్‌ వచ్చింది. నగ్నంగా ఉన్న అమ్మాయి మాట్లాడింది. తన పేరు వివరాలు తెలిపింది. కొద్ది గంటల తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫేస్‌బుక్‌లో సైబర్‌ నేరస్థులు ఆ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే కంపెనీ యాజమాన్యానికి పంపుతామని బెదిరించారు. రూ.1.25 లక్షలు సైబర్‌ నేరస్థులు సూచించిన ఖాతాలో జమ చేశారు. తనలా మరొకరు మోసపోకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసు పేరుతో బెదిరింపు

బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించారు. దిల్లీలో ఉంటున్న నేరస్థులు ముఠాలుగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని గుర్తించారు. అమ్మాయితో వీడియోకాల్‌ చేయించిన తర్వాత దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ వారే ఫోన్‌ చేస్తున్నారు. డబ్బు ఇస్తానంటూ బాధితుడు ఒప్పుకోగానే రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తారు. తాము అంత ఇవ్వలేమంటూ బాధితులు చెబితే.. బేరం మాట్లాడి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల్లోపు నగదు బదిలీ చేయించుకుంటారు. తర్వాత సిమ్‌ కార్డులను నాశనం చేస్తున్నారు.

అలాంటి కాల్స్‌కు స్పందించకండి

ఈ తరహా వీడియోకాల్‌ వస్తే స్పందించవద్దని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. వల వేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు నేరస్థులు ఇలా చేస్తున్నారని తెలిపారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు ఉంచుతామని హెచ్చరించినా గట్టిగా మాట్లాడాలన్నారు. వీడియోకాల్‌ వచ్చిన వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నంబరు 94906 16555కు సమాచారం అందించాలని ఒక పోలీస్‌ అధికారి సూచించారు.

ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.