Mahesh Bank Hacking Case: 'హ్యాకర్​ కోసం వేట... బ్లూ కార్నర్ నోటీసులు సిద్ధం'

author img

By

Published : May 12, 2022, 3:53 PM IST

Mahesh Bank

Mahesh Bank Hacking Case: మహేశ్​ బ్యాంక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంక్ సర్వర్​లోకి చొరబడిన హ్యాకర్​ను గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కేసులో ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్న సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకునే వేటలో పడ్డారు.

Mahesh Bank Hacking Case: మహేశ్​ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో హ్యాకర్​ను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. హ్యాకింగ్ చేసిన వ్యక్తి ఎవరనేది గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసులు ఉపయోగపడనున్నాయి. కేంద్ర హోంశాఖ సాయంతో సైబర్ క్రైం పోలీసులు... ఇంటర్ పోల్ అధికారులకు బ్లూ కార్నర్ నోటీసులు అందజేయనున్నారు. హ్యాకర్ ఉపయోగించిన ఫ్రాక్సీ ఐపీలను నోటీసుల్లో పొందుపర్చనున్నారు. దీని ఆధారంగా ఇంటర్ పోల్ అధికారులు ఏ దేశం నుంచి ఐపీలు ఉపయోగించారు, నిందితులు ఎవరనేది దర్యాప్తు చేసి... ఆ వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు అందించనున్నారు.

రెడ్ కార్నర్ నోటీసులు: నిందితుడు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత సైబర్ క్రైం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి... ఇంటర్ పోల్ అధికారుల సాయంతో సదరు నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారనే మాట ఎక్కువగా వింటుంటాం. నేరం చేసి వ్యక్తి ఎవరు, ఏ దేశంలో ఉన్నారనే విషయం తెలిస్తే... పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి అందులో నిందితుడి వివరాలను ఇంటర్ పోల్ అధికారులకు అందజేస్తారు. వివరాల ఆధారంగా ఇంటర్ పోల్ అధికారులు సదరు దేశంలో ఉన్న నిందితుడిని పట్టుకొని అప్పజెప్తారు.

రూ. 12 కోట్లు కొల్లగొట్టిన నిందితుడు: నిందితుడెవరో తెలియనప్పుడు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా ఇంటర్ పోల్ అధికారులకు అందిస్తారు. వాటి సాయంతో నిందితుడెవరో గుర్తించి సంబంధిత పోలీసులకు ఇంటర్ పోల్ అధికారులు సమాచారమిస్తారు. మహేశ్​ బ్యాంక్ సర్వర్​ను ఫ్రాక్సీ ఐపీలు ఉపయోగించి హ్యాక్ చేసి రూ. 12కోట్లు కొల్లగొట్టారు. ఫ్రాక్సీ ఐపీలు లండన్, దక్షిణాఫ్రికా, నైజీరియాల పేరుతో చిరునామా చూపిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చే ఆధారాలతో ఇంటర్ పోల్ అధికారులు సరైన చిరునామా గుర్తించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.