ETV Bharat / state

ఆధునిక వైద్యం.. ఆ ప్రజలకు అందేది ఎప్పుడో..!

author img

By

Published : Apr 2, 2023, 2:09 PM IST

Patancheru Government Hospital
పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి

Patancheru Super Specialty Hospital: పరిశ్రమలు ఎక్కువ ఉంటే.. ఏ సమయానికి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునేందుకు వైద్యశాలకు వెళ్తాం. అలాంటి సమయంలో దగ్గరలో అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రి లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించినా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి.

Patancheru Super Specialty Hospital: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చెందింది. అందువల్ల ఈ ప్రాంతంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు నివసిస్తుంటారు. పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో కార్మికులు నిత్యం పనికి వెళ్తుంటారు. ఏ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రదేశంలో అన్ని సౌకర్యాలు ఉన్న ఆధునిక ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. దీంతో ఆ పరిశ్రమల్లో మృతి చెందిన వారిని సమీపంలో ఉన్న హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నందున గాయాలపాలైన వ్యక్తులను సరైన సమయానికి తీసుకొని వెళ్లలేక మృతి చెెందిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఆసుపత్రి నిర్మాణానికి రూ.70 కోట్లు : ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. 2022లో రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.45 కోట్లు, కావాల్సిన సౌకర్యాలు, వైద్య పరికరాల ఏర్పాటుకు రూ.25 కోట్లు కేటాయించాలి. ప్రస్తుతానికి ఈ వైద్యశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయించాలని స్థానిక నాయకులు భావించారు. ఇప్పటికీ ఆ పనులు పూర్తికాకపోవడంతో ఆలస్య లోపంపై విమర్శలు వస్తున్నాయి.

టెండర్‌ దక్కించుకున్న శివరాం కంపెనీ: పటాన్‌చెరులో ఇప్పటికే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. దాంట్లోనే 200 పడకలతో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను సమకూరుస్తున్నాయి. 2022 జూన్‌ 16న ఆయా నిధులు కేటాయిస్తూ.. ఆ రెండు విభాగాలు జీవోలు జారీ చేశాయి. భవన నిర్మాణ పనుల టెండర్లను గత సంవత్సరం సెప్టెంబరు 22న శ్రీ శివరాం కంపెనీ దక్కించుకుంది. దానికి సంబంధించిన ఒప్పందం ప్రక్రియ సైతం పూర్తయింది. పనులు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. దీంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. వైద్యశాల పనుల పర్యవేక్షణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు అప్పగించారు. కేటాయించిన నిధులతో సరైన సమయానికి పనులు పూర్తి చేసి ఉంటే 24 గంటలు ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

"ప్రైవేట్‌ ఆసుపత్రి మాదిరి అన్ని విభాగాల్లో వైద్యాధికారులు, సిబ్బందిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌రే, సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్ర పరికరాలను ఏర్పాటు చేయాలి. వైద్యశాలల్లో సీసీ కెమెరాలు పెట్టాలి. ఘన, ద్రవ వ్యర్థాలకు ప్రత్యేకంగా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటును నిర్మించాలి. వృథా నీటిని శుద్ది చేసి ఆవరణలో ఉన్న మొక్కలకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. వైద్యశాల ప్రజలకు అందుబాటులోకి వస్తే ఖరీదైన వైద్యం అందుతుంది. త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తాం."-జిల్లా ఆసుపత్రులు, సేవల సమన్వయకర్త

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.