ETV Bharat / state

ఏపీలో కరోనా విజృంభణ - శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు

author img

By

Published : Apr 18, 2020, 6:17 AM IST

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతోంది. నిన్న కొత్తగా 38 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరింది. అత్యధిక కేసులతో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ బారి నుంచి 35 మంది బయటపడగా....14 మంది మృతి చెందారు.

ఏపీలో కరోనా విజృంభణ - శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు
ఏపీలో కరోనా విజృంభణ - శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 126కు చేరుకుంది. శుక్రవారం 4 కొత్త కేసులు నమోదయ్యాయి. పొన్నూరుకు చెందిన యువకుడితో పాటు గుంటూరు నగరానికి చెందిన ముగ్గురికి వైరస్‌ సోకింది. పొన్నూరు యువకుడికి నెల క్రితం ఇటలీ నుంచి వచ్చిన సోదరుడి ద్వారా వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక గుంటూరు 3 కేసులకు సంబంధించి వారి కుటుంబసభ్యుల ద్వారా వైరస్ సంక్రమించినట్లు తేల్చారు. జిల్లాలో కరోనా పాజిటివ్ గా తేలిన మొదటి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. గతంలో అనుమానం ఉన్న వారందరినీ గుంటూరు తరలించి పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇపుడు ట్రూనాట్ విధానంలో ప్రిజంప్టివ్ పాజిటివ్ గా తేలిన వారికి పరీక్షలు చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. గుంటూరు నగరంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ ఆదేశించారు. రెడ్ జోన్లలో కమిషనర్ పర్యటించారు.

కర్నూలు జిల్లాలో నిన్న 13 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 126 మందికి వైరస్‌ సోకింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. ఒక్కరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి పాజిటివ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె వద్ద వైద్యం పొందిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఓ వైద్యుడు కరోనాతో మృతి చెందారు. ఆయన వద్ద వైద్యం తీసుకున్నవారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆ వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా వచ్చినట్లు సమాచారం. ఎక్కువ కేసుల ఉన్నందున పోలీసులు లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో కొత్తగా ఆరుగురికి వైరస్‌ సోకింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 64 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నెల్లూరు తర్వాత నాయుడుపేట లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో కొత్తగా నలుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్థారణ కావడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 52కు చేరింది . పాజిటివ్ వచ్చిన నలుగురూ దిల్లీ మత కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన వారే . కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. దిల్లీ వెళ్లి వచ్చి 28 రోజులు గడిచినా తర్వాత పాజిటివ్ రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా థెరపీ చేసే అంశంపై మంగళగిరి ఎయిమ్స్ , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్య చర్చలు జరిగాయి.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 42 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల లేనప్పటికీ అధికారులు లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. కడప జిల్లాలో 37 మందికి కరోనా సోకింది. నిన్న కొత్తగా ఒక కేసు నమోదైంది. నిబంధనలు మరిచి జమ్మలమడుగుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు 34నమోదయ్యాయి. ఇటీవల 11పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. జిల్లాలో ఇప్పటికే 13ప్రాంతాల్లో రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 28 కి చేరింది.

శ్రీకాళహస్తిలో తాజాగా ఐదుగురి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు వారిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలో నిన్న నమోదైన 5 కేసులతో కలిపి మొత్తం 22 మందికి కరోనా వైరస్‌ సోకింది.విశాఖ జిల్లాలో 20 మందికి వైరస్‌ సోకగా..10 మంది డిశ్చార్జి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజులుగా కొత్త కేసులేమీ నమోదుకాలేదు. ఇప్పటివరకు 17 మందికి వైరస్‌ సోకింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకూ ఎలాంటి కేసులూ నమోద కానప్పటికీ వైరస్ కట్టడికి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.