ETV Bharat / state

CONGRESS: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ ఆందోళనలు

author img

By

Published : Jun 11, 2021, 9:26 PM IST

కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాల వైఫల్యంతోనే లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌లను భారీగా పెంచారని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ... ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పెట్రోల్ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Congress protests
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ ఆందోళనలు

దేశంలో పెట్రో బాదుడుపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. కరోనా వేళ ప్రజలను మరింత పేదరికంలో నెట్టేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పాల్గొని... నిరసన వ్యక్తం చేశారు. హిమాయత్ నగర్​లో ఎన్​ఎస్​యూఐ నేతలు... 'టూ వీలర్ బైకులు ఫర్ సెల్' అంటూ ప్రదర్శన చేపట్టారు. ద్విచక్రవాహనాలను తోపుడు బండ్లపై తరలించి నిరసన చేపట్టారు. లిబర్టీ కూడలి వద్ద పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి రిక్షా తొక్కుతూ నిరనస వ్యక్తం చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరా సంస్థ లిమిటెడ్ పెట్రోలు బంక్ వద్ద పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం ఎక్సైజ్ సుంకం, వ్యాట్​లను భారీగా పెంచారని విమర్శించారు. చమురు ధరలపై రాష్ట్ర పన్నును ప్రభుత్వం వెంటనే తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు.

ధరలు తగ్గించాలంటూ..

ఘట్‌కేసర్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. వరంగల్-హైదరాబాద్ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద ఆందోళనకు దిగి చమురు ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. నర్సంపేటలోని పెట్రోల్‌ బంక్‌ల ముందు బైఠాయించి... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూపాలపల్లిలోని పెట్రోల్‌ బంక్‌ల వద్ద కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలంటూ... నిరసన ప్రదర్శన నిర్వహించారు.

నిరసన ప్రదర్శనలు

ఖమ్మంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం, వైరా రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బైఠాయించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్యర్యంలో ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇందిరాభవన్ నుంచి కొత్తబస్టాండ్ వరకు ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. కరోనాతో ప్రజాజీవనం అస్తవ్యస్థంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాల తీరు సామాన్యుల నడ్డీ విరిచేలా ఉందని ఆరోపించారు.

వినూత్న రీతిలో..

గద్వాలలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వనపర్తి జిల్లా కేంద్రంలో పెట్రో ధరలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Youth Congress : ట్యాంక్​బండ్​లో బైక్​ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.