ETV Bharat / state

Congress Party 137th Foundation Day: 'దేశానికి పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ రావాలి'

author img

By

Published : Dec 28, 2021, 12:28 PM IST

Congress Party 137th Foundation Day: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్​లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్
Congress

దేశానికి పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్

Congress Party 137th Foundation Day: భాజపా, తెరాస పాలన దేశ, రాష్ట్ర ప్రజలకు ప్రమాదకరంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో 137 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. హరితవిప్లవం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందని రేవంత్​ రెడ్డి అన్నారు. అమ్మాయిల వివాహ వయసు పెంపు అంశం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్.. దేశం కోసమే పుట్టిన పార్టీ అని రేవంత్‌రెడ్డి అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో శ్రమించిందన్న ఆయన... 130 కోట్ల మందికి భద్రత కల్పించే పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. కొంతమంది కాంగ్రెస్‌ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ప్రస్తుత పాలకులు యువతకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ రావాలని ఆకాంక్షించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

'మతతత్వ పార్టీ, మతాన్ని అడ్డంపెట్టుకుని హిందుత్వం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందడానికి ఎన్నికల ముందు కొత్త చట్టాలు తీసుకొచ్చి మీరు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే దేశ ప్రజలు ఊరుకోరు. వాళ్లు మిమ్మల్ని క్షమించరు. ఆడపిల్లల పెళ్లి వయసును మీరు పెంచాలనుకుంటే... దేశంలో ఉండే అన్ని ప్రాంతాల మహిళా సంఘాలు, మహిళల దగ్గరకు వెళ్లాలి. అన్ని కాలేజీలకు వెళ్లాలి. వాళ్ల అభిప్రాయ సేకరణ చేయాలి. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే బావుంటుంది. అంతే కానీ హడావుడి రాజకీయాలకు మీరు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. ఇలాంటివి తాత్కాలిక ప్రయోజనాల కోసం చేయొద్దని సూచన చేస్తూ... ఈ దేశ యువతకు, తెలంగాణ యువతకు నా విజ్ఞప్తి ఒక్కటే... ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ప్రమాదకరం, దేశానికి నరేంద్రమోదీ నాయకత్వం అత్యంత ప్రమాదకరం. వీరిద్దరిని వదిలించుకోవాలంటే ఈ దేశయువత నడుం బిగించాలి.'

-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

సింగరేణి నుంచే దక్షిణ భారత రాష్ట్రాలకు బొగ్గు సరఫరా జరుగుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తెరాస ఎంపీలు మాట్లాడలేదన్న ఉత్తమ్... కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తేనే ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌లో ప్రకటన చేశారని స్పష్టం చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై పునఃపరిశీలన చేస్తామని చెప్పారని ఉత్తమ్ వివరించారు. పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఉత్తమ్ ఆరోపించారు. భాజపా, తెరాసలు అంతర్గతంగా పొత్తులోనే ఉన్నాయని విమర్శించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.