గవర్నర్ మీద కోపంతో గణతంత్ర దినోత్సవం జరపకపోవడం అవమానకరం: మల్లు రవి

గవర్నర్ మీద కోపంతో గణతంత్ర దినోత్సవం జరపకపోవడం అవమానకరం: మల్లు రవి
High Court verdict on Republic Day arrangements: 'గణతంత్ర దినోత్సవాన్ని పెరేడ్‌తో నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించడాన్ని'.. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆరోపించిన ఆయన.. గవర్నర్ మీద కోపంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.
High Court verdict on Republic Day arrangements: స్వతంత్య్ర దినోత్సవం మాదిరిగానే జనవరి 26వ తేదీ కూడా దేశం మొత్తం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని.. కానీ మన రాష్ట్రంలో మాత్రం కోవిడ్ సాకు చూపించి జరుపుకోకపోవడం దురదృష్టకరమని పీసీసీ సీనియార్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని పెరేడ్‌తో నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ సర్కార్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కోవిడ్ నిబంధనలు గుర్తుకురాలేదా..? అని మల్లు రవి ప్రశ్నించారు. రాజ్యాంగం మీదకాని, గణతంత్ర దినోత్సవ వేడుకల మీదకాని సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం గౌరవం లేదని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్‌ను కేసీఆర్ అవమానిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యక్తులకు చెందిన వ్యవహారాలను వ్యవస్థలోకి తీసుకురావడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. గవర్నర్ మీద కోపంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావులు తదితరులు పాల్గొన్నారు.
Republic Day Celebrations in Telangana: గణతంత్ర దినోత్సవం ఎప్పటిలాగే ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గణతంత్ర ఉత్సవాలు, కవాతును ప్రభుత్వం నిర్వహించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి కె.శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గతంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో దేశభక్తిని చాటేలా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం.. ఈ ఏడాది విస్మరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్‌రెడ్డి వాదించారు. సంప్రదాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
బీజేపీ నేతలు రియాక్షన్: మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. పరేడ్‌తో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాజ్యాంగం, న్యాయస్థానాలపై కేసీఆర్‌కు గౌరవం ఉంటే.. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయాలన్నారు.
కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ఉండాలని.. ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుతున్నానన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం గర్వించదగ్గ వేడుకకు రాజకీయాలు ఆపాదించడం దారుణమని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఇవీ చదవండి:
