ETV Bharat / state

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళన

author img

By

Published : Sep 25, 2020, 3:24 PM IST

పార్లమెంట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో- ఆర్డినేషన్ కమిటీ భారత్ పిలుపు మేరకు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళన
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళన

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో- ఆర్డినేషన్ కమిటీ భారత్ పిలుపు మేరకు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కీలక వ్యవసాయ రంగం ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ... హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ఆదాయ పన్ను కార్యాలయం వద్ద ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.

పెద్దఎత్తున నినాదాలు..

ఆదాయ పన్ను కార్యాలయం వద్ద ధర్నాకు ఉపక్రమించిన వామపక్షాలు, రైతు సంఘాలు... కిసాన్ బిల్లులు ఆమోదించవద్దంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్‌బాషా, పశ్య పద్మ, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, సారంపల్లి మల్లారెడ్డి, వెంకట్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకటరామయ్య తదితరులు హాజరై తమ సంఘీభావం వ్యక్తం చేశారు. అఖిలపక్ష రైతు సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

కేంద్రం తీరుపై మండిపాటు..

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, యువత తరలివచ్చి కేంద్రం తీరును తప్పుపట్టారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కార్పొరేట్ల అనుకూల విధానాలు అవలంభిస్తున్న మోదీ సర్కారు... తాజాగా వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే మూడు బిల్లులు తీసుకొచ్చిందని, అవి తక్షణమే వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటున్న ప్రధాని... వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించేందుకు నడుం బిగించారని ధ్వజమెత్తారు. ఇది ఆరంభం మాత్రమేనని... దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి బిల్లులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తాయని చాడ హెచ్చరించారు.

వెనక్కి తీసుకోవాలి..

పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించిన కేంద్రం... ఈ మూడు బిల్లులు వెనక్కి తీసుకోవాలని జూలకంటి రంగారావు డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రోడ్డెక్కుతున్నారని... ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కీలకమైన వ్యవసాయ రంగాన్ని ప్రైవేటుపరం చేసేలా ప్రమాదకర బిల్లుల వల్ల రైతులు నష్టపోయి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందని మాజీ ఎమ్మెల్సీ సీతారాములు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హేమంత్​ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.