ETV Bharat / state

పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో ముగిసిన ఎన్​ఐఏ సోదాలు

author img

By

Published : Apr 1, 2021, 4:24 PM IST

Updated : Apr 1, 2021, 6:14 PM IST

పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో ఎన్​ఐఏ సోదాలు ముగిశాయి. ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి, ప్రజలను చైతన్యం చేస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకొని ఎన్ఐఏ దాడులు చేస్తోందని పౌరహక్కుల, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. రాజ్యాంగ హక్కుల సాధన కోసం పోరాడుతున్న వారే లక్ష్యంగా సోదాలు నిర్వహించారని ఆరోపించారు.

Completed NIA probes
ముగిసిన ఎన్​ఐఏ సోదాలు

పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు ముగిశాయి. న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు, హార్డ్​డిస్క్​లు, పెన్ డ్రైవ్​లు స్వాధీనం చేసుకున్నారు.

హాజరుకావాలి...

సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు సోదాలు నిర్వహించి వాళ్లను ప్రశ్నించారు. అనంతరం నలుగురికి ఎన్ఐఏ అధికారులు నోటీసులిచ్చారు. ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టులో కేసులున్నందను శనివారం వస్తానని న్యాయవాది రఘునాథ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పగా వాళ్లు అందుకు అంగీకరించారు. డప్పు రమేశ్, జాన్, శిల్ప.. ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కానున్నారు.

తెలుగురాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు...

తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్‌తో పాటుగా విశాఖ, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూ.గో, కడపలో సోదాలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్, రూ.10 లక్షలు, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్‌నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.

అర్బన్ నక్సలైట్లుగా ముద్ర...

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి, ప్రజలను చైతన్యం చేస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకొని ఎన్ఐఏ దాడులు చేస్తోందని పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యాంగ హక్కుల సాధన కోసం పోరాడుతున్న వాళ్లను మావోయిస్టులుగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏకకాలంలో సోదాలు...

గతేడాది నవంబర్​లో ఆదివాసీల గ్రామాలపై విరుచుకుపడుతున్న గ్రేహౌండ్స్ దళాల దృశ్యాలను చిత్రీకరించినందుకు పొంగి నాగన్నపై మావోయిస్టు కొరియర్​గా కేసు నమోదు చేశారని... ఆ కేసులు మావోయిస్టు నేతలతో పాటు ప్రజా సంఘాలకు చెందిన 64 మందిని నిందితులుగా చేర్చడం ఎంతవరకు సమంజసమని లక్ష్మణ్ అన్నారు. కేసును స్వీకరించిన ఎన్ఐఏ... తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 27 మంది ఇళ్లల్లో సోదాల పేరుతో అలజడి సృష్టించారని పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. ఎన్ఐఏ నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి

Last Updated : Apr 1, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.