ETV Bharat / state

Disha Case: తొలిరోజు ముగిసిన విచారణ.. 26 నుంచి మరోసారి..!

author img

By

Published : Aug 21, 2021, 3:42 PM IST

Updated : Aug 21, 2021, 10:24 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై(disha encounter case) కమిషన్‌ కార్యాలయంలో త్రిసభ్య కమిషన్‌ తొలిరోజు విచారణ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కమిషన్ అఫిడవిట్ల వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం తరఫున సాక్షిగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్త హాజరయ్యారు.

Disha Case: తొలిరోజు ముగిసిన విచారణ.. 26 నుంచి మరోసారి..!
Disha Case: తొలిరోజు ముగిసిన విచారణ.. 26 నుంచి మరోసారి..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్​ సిర్పూర్కర్ కమిషన్ మొదటి రోజు విచారణ ముగిసింది. ప్రభుత్వం తరఫున హోం శాఖ కార్యదర్శి రవిగుప్త విచారణకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో త్రిసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సిర్పూర్కర్, సభ్యులు జస్టిస్ రేఖ, కార్తికేయన్​లు రవిగుప్తను పలు ప్రశ్నలు అడిగారు. సిట్​తో పాటు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్​లలోని వివరాలను హోంశాఖ కార్యదర్శి రవిగుప్త వివరించారు.

ఎన్​కౌంటర్ జరిగిన సమయంలో నిందితుల కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసులకు ఏ స్థాయిలో గాయాలయ్యాయని రవిగుప్తను కమిషన్ ప్రశ్నించింది. తీవ్ర గాయాలయ్యాయని రవిగుప్త చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని కమిషన్.. శరీరంలో ఎక్కడెక్కడ గాయాలయ్యాయనే పూర్తి సమాచారం చెప్పాలని ఆదేశించింది.

ఎన్​కౌంటర్ చేసిన సమయంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల గురించి కూడా కమిషన్ ప్రశ్నించింది. అఫిడవిట్లు దాఖలు చేసిన నలుగురు లాయర్లూ ఎన్​కౌంటర్​పై తమకున్న సందేహాలను కమిషన్ ముందుంచారు. దీనికి రవిగుప్త సమాధానం ఇచ్చారు. దిశ సోదరి సైతం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆమె కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లోనూ సిర్పూర్కర్ కమిషన్ మరోసారి విచారణ నిర్వహించనుంది. 18 మంది సాక్ష్యులను కమిషన్ విచారించనుంది.

సుప్రీం ఆదేశాలు

దిశ త్రిసభ్య కమిషన్‌ ఇప్పటి వరకు ప్రజల నుంచి 1,333 అఫిడవిట్లు, పోలీసులు, ప్రభుత్వం, సాక్షులు, వైద్యుల నుంచి 103 అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్‌ ఇప్పటి వరకు 16 సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పోలీసులు సమర్పించిన 24 అఫిడవిట్లలో కొన్నింటికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రులతో పాటు, మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2019 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేసు నేపథ్యం ఇదీ..

దిశ అనే యువతి 2019 నవంబరు చివరి వారంలో హైదరాబాద్‌ శివార్లలో హత్యాచారానికి గురైంది. నాలుగు రోజుల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. డిసెంబరు 6న దిశ వస్తువుల సేకరణ కోసం వచ్చినప్పుడు నిందితులు తమ తుపాకులు లాక్కోవడంతో కాల్పులు జరిపామని.. ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. 2019 డిసెంబరు 12న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది చివరికల్లా..

బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌లను సభ్యులుగా నియమించింది. 2020 జులైలో కమిషన్‌ నివేదిక సమర్పించాల్సి ఉన్నా.. మరో ఆరు నెలలు గడువు కోరింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2021 జనవరిలో మరోసారి గడువు పొడిగింపు కోరింది. రెండోసారి ఇచ్చిన గడువు కూడా జులైతో ముగియడంతో ఇంకోసారి పొడిగింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ జరిపి... వాదనలు విన్న సుప్రీంకోర్టు కమిషన్‌ విచారణ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది చివర్లో సాధ్యమైనంత వరకు విచారణను ముగించాలని త్రిసభ్య కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా నేడు ప్రభుత్వాన్ని విచారించింది. ఈ నెల 26,27,28 తేదీల్లో సాక్ష్యులను విచారించనుంది.

ఇదీ చదవండి: KTR: 'రైతుల శ్రేయస్సు పట్ల తెరాస ప్రభుత్వం నిబద్ధతతో ఉంది'

Last Updated :Aug 21, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.