ETV Bharat / state

నేనూ రైతు బిడ్డనే వ్యవసాయం మా సంస్కృతి - దావోస్​లో సీఎం రేవంత్ ప్రసంగం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 9:00 AM IST

CM Revanth Speech At Davos : అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాల్సిన అవసరం ఉందని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 'ఆహార వ్యవస్థలు-స్థానిక కార్యాచరణ' అనే అంశంపై ప్రసంగించిన సీఎం, రైతులకు కార్పొరేట్‌ తరహా లాభాలు రావాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. ఐటీఐల్లో సాంకేతిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్‌ ఒప్పందం చేసుకోగా, యూకే సంస్థ ఎస్​ఐజీహెచ్​ వైద్య పరికరాల తయారీ కేంద్రం నెలకొల్పేందుకు అంగీకరించింది.

Major Investments in Telangana
CM Revanth Reddy Davos Tour

CM Revanth Reddy Davos Tour ముగిసిన సీఎం రేవంత్ దావోస్ టూర్ చివరి రోజు బడా కంపెనీలతో ఒప్పందాలు

CM Revanth Speech At Davos : పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. చివరి రోజు దావోస్ కేంద్రంగా రాష్ట్రంలో పెట్టుబడులపై మరిన్ని ఒప్పందాలు జరిగాయి. వివిధ కంపెనీల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. యూకేకి చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ రూ.231 కోట్లతో హైదరాబాద్‌లో వైద్య పరికరాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎస్​ఐజీహెచ్​ ఎండీ గౌరి శ్రీధర, డైరెక్టర్‌ అమర్ చర్చల అనంతరం ఒప్పందం జరిగింది.

CM Revanth Reddy Davos Tour : మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను ఉత్పత్తి చేయనుంది. రానున్న రెండు, మూడేళ్లలో పరిశ్రమ పూర్తిస్థాయిలో ఏర్పాటు కానుంది. ఉబర్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రెండు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకొచ్చింది.

హైదరాబాద్​లో ఉబర్​గ్రీన్ : అమెరికా తర్వాత అతి పెద్ద టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఉబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఉబర్ గ్రీన్ పేరుతో ఎలక్ట్రికల్ వాహనాలు, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలతో ఉబర్ షటిల్ సేవలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్టులో సుమారు వెయ్యిమందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్​

రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు టాటా సన్స్ గ్రూప్(TATA Group Investments in Telangana) సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని యాభై ఐటీఐలను రూ.1500 కోట్లతో స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు వివిధ రంగాల్లో విస్తరణకు ప్రణాళిక చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. టీసీఎస్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్, టీటీఎల్, ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరణపై చర్చించారు.

హైదరాబాద్​లో ఐటీ సేవలను విస్తరించేందుకు 'క్యూ సెంట్రియో'(Cue centrio Telangana) సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో సప్లయ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు 'ఓ నైన్' సంస్థ అంగీకరించింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో క్యూ సెంట్రియో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి, ఓ నైన్ సీఈవో చక్రి గొట్టిముక్కుల సమావేశమయ్యారు. హైదరాబాద్​లో అధునాతన డిజిటల్ డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో సిస్ట్రా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.

దావోస్​లో 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' క్యాంపెయిన్​ - పెట్టుబడుల వేట షురూ చేసిన సీఎం రేవంత్

అన్నదాతకు ప్రపంచం అండగా నిలవాలి : సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండబోవన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో భాగంగా ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘నేను రైతు బిడ్డను.. వ్యవసాయం మా సంస్కృతి’’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్‌లో వ్యవసాయం తీవ్ర సమస్యల్లో ఉందన్న ఆయన రైతు ఆత్మహత్యలు అతి పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కంటే, ఎక్కువ లాభాలు రావాలన్నది తన స్వప్నమని పేర్కొన్నారు.

భారత్‌లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతు ఆత్మహత్యలు, అతిపెద్ద సమస్యగా మారాయి. రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోలేరు. వారికి బ్యాంకు రుణాలు రావు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, అందుబాటులో లేవు. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం నేరుగా రైతులకే అందించే కార్యక్రమం ప్రారంభించింది. కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా, రైతులు లాభాలు ఆర్జించాలనేది నా స్వప్నం. కార్పొరేట్ రంగంలో పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం మాదిరిగా ఈ లాభాలు ఉండాలి. ఈ సదుపాయాన్ని మనం కల్పిస్తే 99 శాతం రైతు ఆత్మహత్యలు ఉండవు. రైతులు ఎల్లప్పుడూ ప్రపంచానికి సాయం చేస్తున్నారు. ప్రపంచం కూడా అన్నదాతలకు అండగా ఉండాలి." - రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM Revanth London Tour Updates : దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మూడ్రోజుల పర్యటన ముగిసింది. మూడు రోజుల్లో సుమారు రూ.38వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. దావోస్ పర్యటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి లండన్ వెళ్లారు. మూడు రోజులు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చలతో పాటు థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకంపై అధ్యయనం చేయనున్నారు.

తెలంగాణతో అదానీ గ్రూప్​ ఒప్పందాలు - రూ.12,400 కోట్లకు పైగా పెట్టుబడులు

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - దావోస్​ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.