ETV Bharat / state

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 8:00 PM IST

Updated : Dec 30, 2023, 9:58 PM IST

Mega DSC Recruitment
CM Revanth Reddy review on Mega DSC Recruitment

CM Revanth Reddy review on Mega DSC Recruitment : మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy review on Mega DSC Recruitment : విద్యార్థులు లేరన్న నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మారుమూల తండాలు, కుగ్రామాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనన్నారు. చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి పిల్లలకు రావద్దని సీఎం చెప్పారు. ఉపాధ్యాయుల కొరత తలెత్తకుండా మెగా డీఎస్సీ(Mega DSC) నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు.

త్వరలోనే మెగా డీఎస్సీ - 9,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్లాన్!

టీచర్ల పదోన్నతులు, బదిలీలలకు(Teachers Transfers) ఆటంకాలను అధిగమించేందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యాసంస్థలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలన్నారు. బడుల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

CM Revanth review on Education Board : రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కొడంగల్‌లో ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు వెళ్లి స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది​ - మార్చి 18 నుంచే ఎగ్జామ్స్

దీనికి సంబంధించి విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పారిశ్రామిక నైపుణ్యంతో ఉద్యోగాలను సాధించేలా స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి ఆధారిత స్వల్ప, దీర్ఘ కాలిక కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లను సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ చేశారు.

ప్రైవేట్ యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యంగం కల్పించిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని సీఎం అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం తెలిపారు.

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు, రీయంబర్స్‌మెంట్‌, బోధన, బోధనేతర సిబ్బంది, ప్రభుత్వం నుంచి పొందిన సదుపాయాలు తదితర వివరాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మౌలిక వసతులు, అర్హులైన సిబ్బంది లేకుండానే ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రమాణాలతో కూడిన విద్యను ఎలా అందిస్తున్నాయని ప్రశ్నించారు.

మన ఊరు-మన బడి పథకం కింద జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో సీఎస్ శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, సీఎంఓ అధికారులు శేషాద్రి, షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు.

ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్​ పరీక్షలు - షెడ్యూల్​ ఇదే

Last Updated :Dec 30, 2023, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.