ETV Bharat / state

ఎరువుల ధరల పెంపుపై కేసీఆర్ తీవ్ర నిరసన.. ప్రధానికి బహిరంగ లేఖ..

author img

By

Published : Jan 12, 2022, 1:08 PM IST

Updated : Jan 12, 2022, 3:27 PM IST

kcr letter to pm modi
సీఎం కేసీఆర్

13:01 January 12

ఎరువుల ధరల పెంపుపై కేసీఆర్ తీవ్ర నిరసన.. ప్రధానికి బహిరంగ లేఖ..

ఎరవుల ధరలు పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు భాజపా చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై నాగళ్లు ఎత్తి తిరగబడితేనే వ్యవసాయాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎరువుల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని కేసీఆర్​ నిర్ణయించారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశాగ కేంద్రం ఎరువుల ధరలను పెంచిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.

కూకటివేళ్లతో పెకలించేలా..

"దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేదిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్రం ఎరువుల ధరలు పెంచి.. అన్నదాతల నడ్డి విరిచింది. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని ఊదరగొట్టి.. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేసింది. కేంద్రంలోని భాజపా పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం. దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదు. ఎరువుల ధరలను విపరీతంగా పెంచారు. పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రలు చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రం అమలు చేస్తోంది. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసేలా కుట్రలు చేస్తోంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్న భాజపాను.. కూకటివేళ్లతో పెకలించి వేయాలి" - కేసీఆర్

వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న భాజపాను కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి.. రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అన్నదాతలు నాగండ్లు ఎత్తి తిరగబడాలని.. లేకుంటే సాగును కాపాడుకోలేని పరిస్థితులు దాపురిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపాకు, కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా.. ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతులు అర్థం చేసుకొని ధరలు తగ్గించే దాకా.. భాజపా ప్రభుత్వంపై చేసే పోరాటంలో కలిసిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: Talasani on theatres: సినిమా టికెట్ల కోసం త్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ : తలసాని

Last Updated :Jan 12, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.