ETV Bharat / state

cm kcr on central government: 'ధాన్యం విషయంలో ఎంతదాకానైనా.. ఎవరితోనైనా పోరాడతాం'

author img

By

Published : Nov 9, 2021, 4:37 AM IST

cm kcr
cm kcr

తెలంగాణ పండించే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో... లేదో స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యమంతటినీ కొనుగోలు చేయాలన్న డిమాండ్​తో శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన తెరాస ధర్నాలు చేస్తుందన్న సీఎం... ఈ విషయంలో కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించిన తాను రాత్రికి రాత్రే దేశద్రోహిని అయ్యానా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడినా భయపడబోమని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై మరోమారు తీవ్రంగా విరుచుకుపడ్డారు (cm kcr warning to bandi sanjay). గొర్రెల పంపిణీలో కేంద్రం వాటా రూపాయి ఉన్నా వెంటనే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అబద్ధాలతో నడిచే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ప్రతి విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆక్షేపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని అన్నారు. చట్టప్రకారం రావాల్సినవి, చేయాల్సినవి కూడా చేయడం లేదని వివరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని కేసీఆర్ మరోమారు డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఆయన... ఇదే డిమాండ్​తో శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన తెరాస ధర్నాలు చేస్తుందని ప్రకటించారు. ధాన్యంపై వైఖరిని స్పష్టం చేసే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపాను వదిలపెట్టబోమన్నారు. భాజపా నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు (cm kcr warning to bandi sanjay).

పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు

రైతుచట్టాలను ఎందుకు ఉపసంహరించుకోరని ప్రశ్నించిన కేసీఆర్... పెట్రోల్, డీజిల్​పై కేంద్రం విధించిన సెస్​ను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా లేనిది ప్రజల తరఫున నిలదీసిన వెంటనే దేశద్రోహిని అయ్యానా అని ప్రశ్నించారు. దేశ భూభాగం గజం కూడా ఇతర దేశాలు ఆక్రమించుకోరాదంటే దేశద్రోహులు అవుతారా... లేక వదిలిపెట్టినవాళ్లు ద్రోహులు అవుతారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని... ఈడీ, ఆదాయపన్ను దాడులు చేయిస్తూ కేసులు పెడుతున్నారని అన్నారు. పిట్టబెదిరింపులకు భయపడబోమన్నారు. ఎలాంటి విచారణలకైనా తాము సిద్దమని మరోమారు ప్రకటించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే అది వికటిస్తుందని అన్నారు.

దేశంలో సమూల సంస్కరణలు రావాల్సిఉంది..

దేశంలో ప్రకృతి, భగవంతుడు ఇచ్చినవన్నీ ఉండి కూడా కేంద్ర ప్రభుత్వాల చేతగానితనంతో ఆశించిన మేర అభివృద్ధి జరగడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, సింగపూర్ లాంటి దేశాలు అద్భుతంగా దూసుకెళ్తోంటే... మనదేశంలో మాత్రం ఇంకా కులం, మతం పేరిట భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో సమూల సంస్కరణలు రావాల్సి ఉందని అన్నారు. దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని అన్నారు.

నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్​వా...? అక్కడికొస్తే ఆరు ముక్కలవుతావు

భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​పై కేసీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. వడ్ల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కేసీఆర్​ ఆరోపించరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గురించి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. తన వ్యవసాయక్షేత్రాన్ని దున్నేందుకు ట్రాక్టర్ డ్రైవర్​వా అని ప్రశ్నించిన కేసీఆర్... అక్కడకు వస్తే ఆరు ముక్కలు అవుతావని ఘాటుగా వ్యాఖ్యానించారు. పొలం కొని సాగు చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా ఎక్కడుందన్న కేసీఆర్.. ఆ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

62 లక్షల ఎకరాల్లో వరిసాగు చూపిస్తా...

కేంద్రం, భాజపా నేతలు వస్తే ఆరు హెలికాప్టర్లు పెట్టి 62 లక్షల ఎకరాల్లో వరిసాగు చూపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. చేతనైతే మొత్తం ధాన్యం కొనుగోళ్లు చేస్తామని కేంద్రంతో ప్రకటన ఇప్పించాలని సీఎం డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీలో కేంద్రం వాటా ఒక్క రూపాయి ఉన్నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

అవసరమనుకున్న వారికి మంత్రి పదవులు ఇస్తుంటాం..

బండి సంజయ్​కు ఫెడరల్ ఫ్రంట్ అత్యవసరంగా కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి హామీ విషయంలో ప్రజలు తమకు తీర్పు ఇచ్చారన్న సీఎం కేసీఆర్... రాజకీయంలో భాగంగా అవసరం అనుకున్న వారికి మంత్రి పదవులు ఇస్తుంటామని వివరించారు. జ్యోతిరాధిత్య సింధియాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడైన తాను బంగారు తెలంగాణ కోసం ఎల్లప్పుడూ పాటుపడతానని... కొన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతుస కోసం పోరాడతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: CM KCR : '2, 3 రోజుల్లో ఉద్యోగ సంఘాలతో భేటీ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.