ETV Bharat / state

ప్రతి ఓటరు పైన దృష్టి పెట్టండి.. గెలుపు మనదే..: సీఎం కేసీఆర్​

author img

By

Published : Mar 1, 2021, 4:44 AM IST

ప్రతి ఓటరు పైన దృష్టి పెట్టండి.. గెలుపు మనదే..: సీఎం కేసీఆర్​
ప్రతి ఓటరు పైన దృష్టి పెట్టండి.. గెలుపు మనదే..: సీఎం కేసీఆర్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణీదేవి... ఘన విజయం సాధిస్తారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. మిగిలిన స్థానాల కోసమే ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ నమోదు చేసిన ఓట్లన్నీ కచ్చితంగా పార్టీకే వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాసలో ఎవరు ఎలా పని చేస్తున్నారనేది ఈ ఎన్నికల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఆషామాషిగా చూడొద్దని... ఆరు ఉమ్మడి జిల్లాల్లో పరిమిత ఓటర్లతో జరుగుతున్నాయని వివరించారు. ప్రతి ఓటరునూ వెతికిపట్టుకొని ఓట్లు సాధించాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోదాంట్లో మూడేసి లక్షలకు... 60 శాతం పైగా ఓట్లు తెరాస కార్యకర్తలు, అభిమానులవేనని తెలిపారు. మన ఓట్లను మనం సాధించుకోవడంతో పాటు... ఇతరుల ఓట్లను సాధించేందుకు ప్రయత్నించాలన్నారు.

కింది స్థానాల కోసమే వారి కొట్లాట..

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పొందుతున్న లబ్ధిదారులు కోటిన్నరమందికి పైగా ఉన్నారని... తెరాసకు 60 లక్షల మంది కార్యకర్తలున్నారని పేర్కొన్నారు. కష్టపడి పని చేస్తే భారీ ఆధిక్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు దరిదాపుల్లో లేరని, వారి గురించి బెంగలేదన్నారు. రెండు నుంచి ఆ కింది స్థానాల కోసమే వారి పోటీ, కొట్లాట ఉందన్నారు.

అతి విశ్వాసం వద్దు..

అతి విశ్వాసం పనికిరాదని, ఎన్నికలు ముగిసే వరకు విశ్రమించవద్దని నేతలకు కేసీఆర్‌ సూచించారు. ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి పార్టీకి ఓటేసేలా ఒప్పించాలన్నారు. ఎవరు ఎలా, ఏం పని చేస్తున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని నేతలకు కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎవరెన్ని ఓట్లను సమీకరించారో గుర్తిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు వరుస సెలవుల వల్ల చాలా మంది సొంతూళ్లకు వెళ్తారని, పార్టీ శ్రేణులందరు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. ప్రతి ఓటరునూ ముందుగానే కలవాలని, ఓటింగ్‌కు దూరం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ మంత్రులకు పెద్దపీట వేశామని, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నారు.

అక్కడ షెడ్యూలు వెలువడిన వెంటనే...

ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల గురించి సీఎం నల్గొండ జిల్లా నేతలతో మాట్టాడారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ప్రచారం వ్యుహం పై సమాశంలో నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశాలు, సమీక్షలు నిర్వహించిన సీఎం... మార్చి 14న ఎన్నికలు ముగిసేవరకు వీటిని కొనసాగించనున్నారు.

రంగంలోకి దిగిన అధినేత

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక, పరిషత్‌, పురపాలక, పంచాయతీ ఎన్నికలు కేటీఆర్​ ఆధ్వర్యంలోనే జరిగాయి. మళ్లీ ఇప్పుడు కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యనేతలతోనూ ఆయన విడిగా చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్లలో సమాచారం తీసుకుంటూ ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికే సర్వేలను కూడా జరిపించారు. సీఎం ఆదేశాల మేరకు కేటీఆర్‌ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'హైదరాబాద్‌ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.