ETV Bharat / state

Cm Kcr On Assembly Sessions: 'అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఘనతను చాటుదాం'

author img

By

Published : Mar 7, 2022, 4:56 AM IST

Cm Kcr On Assembly Sessions: శాసనసభ వేదికగా తెలంగాణ ఘనతను, విజయాలను దేశమంతటికీ చాటిచెప్పాలని సీఎం కేసీఆర్‌ మంత్రులకు సూచించారు. ఎనిమిదేళ్ల స్వల్ప సమయంలోనే రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, తెలంగాణ మాదిరే దేశం కూడా ఇదే స్థాయికి రావాలనే ఆకాంక్షను ప్రతీ ఒక్కరిలో కలగించాలన్నారు.

CM KCR
CM KCR

Cm Kcr On Assembly Sessions: 2022-23 బడ్జెట్‌ ఆమోదమే ప్రధాన అజెండాగా ప్రగతిభవన్‌లో సాగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వివిధ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం తాను ఇప్పటికే ప్రయత్నాలు చేపట్టానని, దీనికి తెలంగాణయే స్ఫూర్తి అని చాటుతున్నానన్నారు. తెలంగాణ 2022-23 కొత్త బడ్జెట్‌ మరింత సంక్షేమపథంలో మందుకు సాగుతుందని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది భారీ బడ్జెట్‌ ద్వారా రాష్ట్రం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుందని చెప్పారు.

తలసరి ఆదాయం, ఆర్థికవృద్ధి రేటు సహా పలు అంశాల్లో గొప్ప ప్రగతిని సాధించడంతో ఇప్పుడు దేశం మొత్తం మనవైపే చూస్తోందని, మన బడ్జెట్‌ ఎంత అని అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు తదితర రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయని చెప్పారు.

పాలనకు గీటురాయి...

KCR On Assembly Sessions: బడ్జెట్‌ అంటే లెక్కలు మాత్రమే కాదని... రాష్ట్ర పురోగతి, ఉన్నతికి ప్రతీక... పాలనకు గీటురాయిగా కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకున్నా సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని వివరించారు. గతేడాది కరోనా ప్రభావం చూపినా ఆదాయం సడలలేదన్న సీఎం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల విషయంలో లోటు రానీయలేదని గుర్తుచేశారు. బడ్జెట్‌పై ఎప్పుడూ భ్రమలు కలిగించలేదని... అంకెల గారడీ చేయకుండా వాస్తవికతను ప్రతిబింబించామని పేర్కొన్నారు. తెలంగాణ పురోగమనానికి ఎంత కష్టపడ్డామో ప్రతీశాఖలోనూ చర్చ సందర్భంగా తెలంగాణ ప్రగతి, దేశం పరిస్థితిని తెలియజెప్పాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

కేంద్రంపై వివక్షపై...

Cm on Central Govt: తెలంగాణకు కేంద్రం ఏ మేరకు అన్యాయం చేసిందో రాష్ట్ర, దేశప్రజలకు శాసనసభ ద్వారా తెలియజెప్పాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. విభజన హామీల అమలులో వైఫల్యం, కేంద్ర ప్రాజెక్టుల మంజూరులో వివక్ష, శాఖలవారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హక్కులపరంగా జరుగుతున్న మోసాలను గణాంకాలతో సహా వెల్లడించాలన్నారు. అన్ని శాఖల మంత్రులు తమ తమ శాఖలపై సంపూర్ణ సమాచారంతో రావాలని సూచించారు. విపక్షాలు విమర్శిస్తే ఆధారాలతో సహా సమాచారం ఇచ్చి వారి నోళ్లు మూయించాలన్నారు. తెరాస సభ్యులంతా సభకు విధిగా హాజరయ్యేలా చూడాలని సీఎం సూచించారు.

గవర్నర్ ప్రసంగంపై...

గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై.. తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశం చర్చించినట్లు సమాచారం. దీనిపై సభలో ఎవరైనా ప్రస్తావిస్తే వాస్తవాలను వివరించాలని మంత్రిమండలిలో నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాలపైనా సీఎం చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భాజపా పతనానికి నాంది అవుతాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణ నమూనాను దేశమంతటికీ విస్తరించేందుకు సంకల్పించానన్న సీఎం శాసనసభలో దీనిని తెలియజేద్దామని వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.