ETV Bharat / state

CM KCR: సచివాలయ ప్రారంభోత్సవం వేళ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

author img

By

Published : Apr 29, 2023, 8:09 PM IST

Telangana New Secretariat Inauguration Day: తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా.. వినూత్న రీతిలో అత్యద్భుతంగా సచివాలయం నిర్మాణం జరిగిందని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయాన్ని చూస్తేనే కడుపు నిండుపోయేలా ఉందన్నారు.

CM KCR
CM KCR

Telangana New Secretariat Inauguration Day: ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా.. వినూత్న రీతిలో అత్యద్భుతంగా సచివాలయం నిర్మాణం జరిగిందని కొనియాడారు. యావత్‌ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భం ఇది అని పేర్కొన్నారు.

అనేక అపోహాలు సృష్టించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు, అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో ఈ సచివాలయం నిర్మాణం జరిగిందని కేసీఆర్‌ వివరించారు. అనతి కాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయి.. ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని..అత్యంత గొప్ప సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్‌ నిర్మాణం జరిగిందన్నారు. అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ.. అనేక విశిష్టతలను సొంతం చేసుకుంటూ.. దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని కొనియాడారు.

Telangana New Secretariat: ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరి.. చూస్తేనే కడుపు నిండే విధంగా అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పని చేసేలా నిర్మితమైన కట్టడం ఇది అని సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగ పని తీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేయనుందని వివరించారు. ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా దీని నిర్మాణం సాగిందన్నారు.

ఒక సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు ఇదే మొదటిసారి: ఒక రాష్ట్ర సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడం దేశంలోనే మొదటిసారని సీఎం చెప్పారు. తెలంగాణ పాలన సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే మహోన్నత లక్ష్యంతో.. తాత్వికత, సైద్దాంతిక అవగాహనతోనే ఆ మహాశయుని పేరును పెట్టడం జరిగిందని వెల్లడించారు. సచివాలయానికి ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్‌ మహాశయుని ప్రతిమ.. ఇవి అన్నీ రేపటి తరానికి దిక్సూచిగా నిలిచి నిరంతరం స్ఫూర్తిని రగిలిస్తాయన్నారు.

సెక్రటేరియట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన.. రాల్లెత్తిన కూలీలకు, మేస్త్రీలకు, నిర్మాణంలో కష్టించి పని చేసిన అన్ని వృత్తుల నిపుణులను, ఆర్కిటెక్టులను, కాంట్రాక్టు ఏజెన్సీలను, ఇంజినీర్లను, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

కేటీఆర్‌ తొలి సంతకం దానిపైనే: రేపు నూతన సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ తొలి సంతకం.. రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ మార్గదర్శకాలపై చేయనున్నారు. సచివాలయంలోని మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్‌ విధులు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.