ETV Bharat / state

ఓఎంసీ కేసులో కీలక అడుగు.. నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలు

author img

By

Published : Oct 28, 2022, 9:04 PM IST

Obulapuram mining case update: ఓబుళాపురం గనుల కేసులో నిందితులపై నాంపల్లి సీబీఐ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్​రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. విశ్రాంత అధికారులు కృపానందం, రాజగోపాల్‌, ఓఎంసీ, గాలి జనార్దన్​రెడ్డి పీఏ అలీఖాన్‌పైనా అభియోగాలు నమోదయ్యాయి. హైకోర్టు స్టే వల్ల ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు అభియోగాలు ఖరారు చేయలేదు.

Obulapuram mining case
Obulapuram mining case

Obulapuram mining case update : ఓబుళాపురం గనుల కేసు విచారణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. సుమారు దశాబ్దం తర్వాత సీబీఐ కోర్టులో నిందితులపై అభియోగాలు ఖరారయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ తో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై ఇవాళ అభియోగాలు నమోదు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై 2012లో న్యాయస్థానం సీబీఐ అభియోగపత్రాలు దాఖలు చేసింది.

ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలన్న నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు చేశారు. వివిధ కారణాల వల్ల పదేళ్లుగా విచారణ ప్రక్రియ ముందడుగు పడలేదు. అయితే ఆరు నెలల్లో కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేయడంతో.. విచారణ వేగం పెరిగింది. నిందితులందరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ ఇటీవల సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. అభియోగాల నమోదుపై ఇరువైపుల వాదనలు కూడా ముగిశాయి. ఇవాళ శ్రీలక్ష్మి మినహా మిగతా నిందితులపై అభియోగాలు ఖరారు చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీసీ 120బి, 409, 420, 468, 471తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 11 కింద విచారణ కోసం అబియోగాలు నమోదు చేసింది.

హైకోర్టు స్టే ఉన్నందున శ్రీలక్ష్మిపై అభియోగాలను ఇవాళ ఖరారు చేయలేదు. నవంబరు 11 న సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 11 న విచారణకు హాజరు కావాలని ఇద్దరు సాక్షులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందం, రాజగోపాల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

ఓఎంసీకి లీజుల కేటాయింపుల సమయంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా.. శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా.. కృపానందం గనుల శాఖ కార్యదర్శిగా.. రాజగోపాల్ గనుల శాఖ సంచాలకుడిగా.. అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డి పీఏగా ఉన్నారు. లీజుల కేటాయింపులో సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందం, రాజగోపాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడి గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో కుమ్మక్కయ్యారని సీబీఐ అభియోగాలను మోపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.