ETV Bharat / state

'ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా..?'

author img

By

Published : Oct 28, 2022, 6:30 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Challenge to CM KCR: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసులో సీఎం కేసీఆర్‌ లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది తెరాస ఎమ్మెల్యేలే అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు గన్‌మెన్లను వదిలి ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తప్పు చేసినందునే ముఖ్యమంత్రి ప్రమాణం చేసేందుకు రాలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా.?'

Bandi Sanjay Challenge to CM KCR: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని భాజపా నేతలు మొదటి నుంచీ చెబుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సీఎం కేసీఆర్​పై బండి సంజయ్ తనదైన శైలిలో​ విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది.. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసులో.. సీఎం కేసీఆర్‌ లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. భాజపా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారన్న ఆయన.. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ భాజపాను అప్రతిష్ఠ పాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెరాస చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తడి బట్టలతో దేవుడిపై ప్రమాణం చేశామని బండి సంజయ్ తెలిపారు. మునుగోడులో ఏ సర్వే చూసినా భాజపా గెలుస్తుందని చెబుతోందన్న బండి.. హుజూరాబాద్‌ ఫలితమే మునుగోడులో పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే కొత్త కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు.

'డబ్బులకు అమ్ముడు పోయేందుకు సిద్ధమైంది తెరాస ఎమ్మెల్యేలే. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల స్టేట్‌మెట్‌ రికార్డు చేయాలి. కానీ.. పోలీసులు అలా చేయకుండా వారిని వదిలేశారు. గన్‌మెన్లను వదిలేసి ఎమ్మెల్యేలు ఒంటరిగా ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లారు. 3 రోజుల నుంచి ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లోనే ఎందుకు దాచిపెట్టారు. ఫామ్‌హౌస్‌లో డబ్బులు దొరికాయని ప్రకటించారు. ఆ డబ్బులు ఏమయ్యాయి. రూ.100 కోట్లు అని ఒకసారి, తర్వాత రూ.15 కోట్లు అని చెప్పారు. ఆ డబ్బు ఏమైంది. నిబద్ధత ఉంటే ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావాలి. దొంగ ఎప్పటికైనా దొరుకుతారు.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అట్టర్‌ ఫ్లాప్‌ సినామాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించినట్టుంది ఈ ఆడియో లీకులు.. తమ కుట్రను కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ఫేక్‌ ఆడియో విడుదల చేశారని బండి సంజయ్ ఆరోపించారు. నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటారా అని ప్రశ్నించారు. దొంగ ఆడియో రికార్డులు తయారు చేయడానికి వారికి రెండ్రోజులు పట్టిందన్న బండి సంజయ్.. నేరస్తులు, ఎమ్మెల్యేల కాల్‌ లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించినట్టుంది ఈ ఆడియో లీకులు అని ఎద్దేవా చేశారు.

సీఎం నిజమైన హిందువు అయితే.. లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చి.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధం లేదని ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. కానీ.. సీఎం స్పందించలేదన్న ఆయన... పోలీసుల సాయంతో తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అందుకే ఆలస్యంగా యాదాద్రి చేరుకున్నానని తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు బరిద్దామని సంజయ్‌ ప్రశ్నించారు. ఈ ప్రమాణంతో కేసీఆర్‌ రాజకీయ జీవిత చరిత్ర కనుమరుగు అవుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.