ETV Bharat / state

డా.పావులూరి కృష్ణ చౌదరి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు

author img

By

Published : Jan 13, 2023, 7:18 PM IST

Etv Bharat
Etv Bharat

Celebrities Pays Tribute to Pavuluri Krishna Chowdary : సుప్రసిద్ధ హోమియోపతి వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి పార్థివదేహానికి పలువురు నివాళులు అర్పించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని పావులూరి నివాసంలో.. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, సినీనటుడు చిరంజీవి, చినజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈవో బాపినీడు సహా పలువురు వైద్యులు నివాళులు అర్పించారు. కృష్ణ చౌదరి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Celebrities Pays Tribute to Pavuluri Krishna Chowdary: ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, దివంగత పావులూరి కృష్ణచౌదరికి పలువురు నివాళి అర్పించారు. పావులూరి కృష్ణచౌదరి అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అమీర్​పేటలోని స్వగృహంలో ఆయనకు పలువురు అంజలి ఘటించారు. ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, సినీనటుడు చిరంజీవి, చినజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పావులూరి కృష్ణచౌదరి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు వైద్యులు, కుటుంబసభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులు హైదరాబాద్ చేరుకున్న తర్వాత సోమవారం పావులూరి కృష్ణచౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలుగునాట హోమియో వైద్యంలో శిఖర సమానుడు.. దాన్ని ప్రతి ఇంటికీ చేర్చడంలో అవిరళ కృషి చేసిన డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి జీవితమంతా ఆ వైద్య విధానాల విస్తృతికి, అభివృద్ధికే వెచ్చించారు. శరీర-మనః-ఇంద్రియ-బుద్ధి స్థాయుల్లో వ్యాధి ఎక్కడి నుంచి.. ఏ క్రమంలో తప్పి, ప్రాణశక్తి అపమార్గం పట్టిందో గుర్తించి, దాన్ని తిరిగి సరైన దారిలోకి మళ్లిస్తే వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడనేది ఆయన తెలుసుకున్న విధానం.

ఇదే పద్ధతిలో వైద్యం చేస్తూ మొండివ్యాధులనూ దారికి తెచ్చిన ఘనాపాఠి ఆయన. ఎంబీబీఎస్‌ చదివిన పావులూరికి స్వానుభవంలో జరిగిన ఓ సంఘటన ఆయనను హోమియోపతి వైపు మళ్లించింది. ఖరీదైన, సంక్లిష్టమైన రసాయనాలతో కూడిన ఇంగ్లిషు మందుల కంటే.. సహజసిద్ధమైన ఔషధాలు అందించే హోమియోనే మేలని నిర్ధారణకు వచ్చారు. ఆ సంకల్పంతోనే లండన్‌ వెళ్లి హోమియో వైద్యంలో పట్టభద్రుడయ్యారు. స్వదేశానికి తిరిగివచ్చి పూర్తిగా ఆ వైద్యసేవలకే అంకితమయ్యారు.

ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి సుమారు 45 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు హోమియోలో పట్టా పొందారు. దేశవ్యాప్తంగా ఆయన శిష్య పరంపర కొనసాగుతోంది. ‘జీయర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (జిమ్స్‌) స్థాపనలో పావులూరి కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే హోమియో ఆసుపత్రి, వైద్య కళాశాలను కూడా ప్రారంభించి, అనతికాలంలోనే ఈ రెండు సంస్థలు దేశ విదేశాల్లో ఖ్యాతిని గడించే స్థాయికి తీసుకెళ్లడంలో పావులూరి ఎనలేని కృషి చేశారు. దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి వ్యక్తిగత వైద్యుడిగా కూడా వ్యవహరించారు.

అనుభవసారానికి అక్షర రూపం: ‘ఈనాడు’ దినపత్రికతో డాక్టర్‌ పావులూరికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఆయనకు ఆప్తమిత్రులు. పల్లెల్లో వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో లేని సమయంలో మారుమూల ప్రాంతాలకు హోమియో వైద్యాన్ని తీసుకెళ్లాలన్న ఆయన ఆలోచనలకు రామోజీరావు ‘ఈనాడు’ పత్రికను వేదికగా అందించారు. ఎంతోకాలం ప్రాక్టీసు చేసి, గడించిన లోతైన తన అనుభవాల సారాన్ని పావులూరి వ్యాసాల రూపంలో సామాన్యులకు చేరువ చేశారు.

ఇదీ కుటుంబ నేపథ్యం: డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి (96)

జననం: 30 జూన్‌ 1926

స్వస్థలం: గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ గ్రామం.

భార్య: సుందర రాజేశ్వరి.. 2010లో కన్నుమూశారు.

ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె: పెద్ద కుమారుడు మానవేంద్రనాథ్‌ 1980లో 18 ఏళ్ల ప్రాయంలోనే మృతిచెందారు. చిన్న కుమారుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌ (పిల్లల వైద్య నిపుణులు), కోడలు డాక్టర్‌ నాగమణి (మానసిక వైద్యనిపుణులు). మనవళ్లు.. రోహన్‌ (వ్యాపారం), చేతన్‌ (ఎంబీబీఎస్‌).. వీరంతా అమెరికాలో స్థిరపడ్డారు.

కుమార్తె: కొడాలి సుమతి (గృహిణి), అల్లుడు కొడాలి గంగాధరరావు. వీరి పిల్లలు అరుణ్‌కుమార్‌, డాక్టర్‌ అపర్ణ. అపర్ణ కూడా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి హోమియోపతిలో పట్టా పుచ్చుకున్నారు. డాక్టర్‌ పావులూరి హోమియో వైద్య వారసత్వాన్ని ఇక్కడే హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.