BJP Comments on BRS MLA Candidates : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. దానికి బదులుగా గులాబీ శ్రేణులు సైతం కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్ దీనిపై స్పందించారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీసీ బిడ్డ గంప గోవర్థన్‌ను పక్కన పెట్టి కేసీఆర్ పోటీ చేయడం దుర్మార్గమని విమర్శించారు.
Kavitha Vs Kishan Reddy : మహిళా రిజర్వేషన్లపై.. కవిత, కిషన్ రెడ్డి వర్డ్ వార్
DK Aruna on Women Reservation : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. కేసీఆర్‌కు దమ్ముంటే అక్బరుద్దీన్, ఈటల రాజేందర్‌పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌కు(CM KCR) మళ్లీ అవకాశం ఇస్తే తెలంగాణాను మింగేస్తారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉన్న అధికారులు సీఎం కాళ్లు మొక్కడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీజేపీ పార్టీని అడ్డుకోవాలనే పన్నాగం పన్నుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. మహిళలకు 33శాతం కోసం పోరాడుతున్న కవిత.. బీఆర్ఎస్లో 3శాతం సీట్లే కల్పించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
MP Arvind on BRS MLA Candidates : గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం (MIM in Telangana) దోస్తీతో ముస్లిం మైనారిటీలకే నష్టమని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మోదీ పాలనలో ముస్లిం మైనారిటీలకు భద్రత పెరిగిందని.. బీజేపీకి ముస్లింల ఓట్లు పెరుగుతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయండని ఎంపీ అర్వింద్ సూచించారు. పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు. పేదలకు గృహ నిర్మాణాల్లో తెలంగాణ సర్కారు చాలా వెనుకబడిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
MP Arvind Fires on KCR : సోమవారం రోజు ప్రకటించిన బీఆర్ఎస్ టికెట్లలో ముగ్గురు ముస్లింలకే సీట్లు ఇవ్వడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 14 శాతం ఓటర్లున్న ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదని.. దళితులకు రూ.10 లక్షలు, ముస్లింలకు ఒక లక్ష ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ఇటీవల బుడబుక్కల అని కేటీఆర్‌ను పొరపాటున సంభోదించానని.. అందుకు బుడబుక్కల సమాజానికి క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.
BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!