ETV Bharat / state

Mann Ki Baat: 'మన్‌ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ ప్రజల మదిలో నిలిచిపోవాలి'

author img

By

Published : Apr 28, 2023, 5:21 PM IST

Mann Ki Baat 100th Episode: మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ను రాష్ట్రంలో కన్నుల పండువగా జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ఎపిసోడ్‌ను అత్యధిక మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ శ్రేణులతో బండి సంజయ్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Mann Ki Baat
Mann Ki Baat

Mann Ki Baat 100th Episode: ప్రజల మనసులో నిలిచేలా ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మన్‌ కీ బాత్‌ను అత్యధిక మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీని ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామని.. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానాన నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్‌ నేడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జిలతో పాటు 7 మోర్చాలకు చెందిన మండల, ఆపై స్థాయి రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 30న నిర్వహించబోయే మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ను కన్నుల పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో.. ప్రతి నియోజక వర్గంలో కనీసం 100 కేంద్రాల్లో సగటున 100 మంది హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రజలందరూ మన్‌ కీ బాత్‌ చూసేలా స్క్రీన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు.

మీడియా, సోషల్‌ మీడియా వేదికలుగా ప్రచారం: సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రతి మన్‌ కీ బాత్‌ సెంటర్‌ వద్ద అలంకరణ చేయడంతో పాటు ప్రజలు, కార్యకర్తలంతా వీక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆ వివరాలను, ఫొటోలతో సహా నమో యాప్‌లో అప్​లోడ్‌ చేయాలని వివరించారు. పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రజలకు ఇప్పటి నుంచే మీడియా, సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పుడు ప్రారంభించారంటే..: ప్రధాని మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్‌ 3వ తేదీన ప్రారంభించారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకొని.. ముందుకు వెళ్లేందుకు రేడియో ప్రోగ్రామ్‌ ద్వారా తమ సందేశాన్ని మోదీ ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ అంశాలనూ ప్రస్తావిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు.. సామాజిక, ఆర్థిక విషయాలపై కూడా ఇందులో మాట్లాడుతుంటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.