ETV Bharat / bharat

6 రోజులు.. 22 ర్యాలీలు.. కర్ణాటకలో నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన

author img

By

Published : Apr 28, 2023, 2:31 PM IST

karnataka assembly election 2023 pm narendra modi campaign
karnataka assembly election 2023 pm narendra modi campaign

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. 6 రోజుల వ్యవధిలో ఏకంగా 22 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నారు. కీలక నియోజకవర్గాలను చుట్టిరానున్నారు. కన్నడ ప్రజలపై కాంగ్రెస్‌ హామీల వర్షం కురిపిస్తున్న వేళ.. అభివృద్ధి నినాదంతో బీజేపీ ముందుకెళ్తోంది. ప్రధాని మోదీ ప్రచారంపై కమలదళం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. బీజేపీ నుంచి అమిత్‌ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. పోలింగ్‌కు ముందు కనీసం 6 రోజుల పాటు ప్రధాని మోదీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కీలక నియోజకవర్గాలను మోదీ చుట్టి వచ్చేలా 22 ర్యాలీలను నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. శనివారం కర్ణాటకలో మోదీ పర్యటన ప్రారంభం కానుంది. ఇందుకోసం బెంగళూరులో బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 29న ప్రత్యేక విమానంలో కర్ణాటక చేరుకోనున్న ప్రధాని మోదీ.. హుమ్నాబాద్‌, విజయపుర, కుడాచి, బెంగళూరు ఉత్తరం నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఆ తర్వాతి రోజు ఏప్రిల్‌ 30న కోలార్‌, చెన్నపట్న, బెలూర్‌ స్థానాల పరిధిలో రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. అనంతరం మోదీ దిల్లీకి వెళ్లి తిరిగి వెళ్తారు.

మే 2న నరేంద్ర మోదీ మళ్లీ కర్ణాటకకు వస్తారు. ఆదే రోజు చిత్రదుర్గ, విజయనగర, సింధనూర్‌, కలబురిగి నియోజకవర్గ ప్రాంతాల్లోనూ, మే 3న మూడాబిడ్రి, కవార్‌, కిట్టూర్‌ పరిధిలో భారీ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ మే 6న మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరోజు చిత్తాపుర్‌, తుమకూరు గ్రామీణం, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం ముగిసే మే 7న మోదీ నాలుగు ర్యాలీల్లో పాల్గొనేలా స్థానిక నేతలు షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. చివరి రోజున బాదామి, హవేరి, శివమొగ్గ గ్రామీణం, బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గాల పరిధిలో మోదీ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాషాయదళం.. డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి నినాదంలో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను నియమించింది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని సహా ఇన్‌ఛార్జిలుగా ఉంచింది. ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి కీలక బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు మే 10 పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.