ETV Bharat / bharat

'నా కూతురే రిషి సునాక్​ను బ్రిటన్​ ప్రధానిని చేసింది.. ప్రతి గురువారం ఆయన..'

author img

By

Published : Apr 28, 2023, 1:28 PM IST

రిషి సునాక్​ను బ్రిటన్​ ప్రధాన మంత్రిని చేసింది తన కుమార్తె అక్షతామూర్తేనని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి అన్నారు. రిషి త్వరగా అధికారంలోకి వచ్చారని.. అయితే అది తన కూతురి వల్లే సాధ్యమైందంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

sudha murthy on akshata murthy
sudha murthy on akshata murthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సమాజ సేవకురాలు సుధామూర్తి తన కుమార్తె అక్షతామూర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షతనే తన భర్త రిషి సునాక్​ను ప్రధాన మంత్రిని చేసిందని ఆమె అన్నారు. రిషి సునాక్‌ త్వరగా అధికారంలోకి వచ్చారని.. అయితే అది తన కుమార్తె వల్లే సాధ్యమైందంటూ వ్యాఖ్యలు చేశారు సుధామూర్తి.

"నేను నా భర్తను ఓ వ్యాపారవేత్తగా చేశాను. నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది. కారణం భార్య మహిమలే. భర్తను ఓ భార్య ఎలా మార్చగలదో చూడండి.. నేను మాత్రం నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేస్తే, నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది" అని ఆమె అంటున్న వీడియో ఇన్​స్టాగ్రామ్​లో చక్కర్లు కొడుతోంది.

అక్షతామూర్తి తన భర్త రిషి సునాక్​ను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసినట్టు సుధామూర్తి చెప్పారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆమె ఎంతో ప్రభావితం చేసినట్టు తెలిపారు. "ఇన్ఫోసిస్​ను గురువారం ప్రారంభించారు. మా అల్లుడి కుటుంబం ఇంగ్లాండ్​లో 150 ఏళ్లుగా (వారి పూర్వీకుల కాలం నుంచి) ఉంటోంది. వారు మతపరమైన ఆచారాలు కలిగిన వారు. నా కుమర్తెను వివాహం చేసుకున్న తర్వాత ప్రతీది గురువారం ఎందుకు ప్రారంభిస్తారు? అని రిషి సునాక్​ అడిగారు. మేము రాఘవేంద్రస్వామిని ఆరాధిస్తాం అని అక్షత చెప్పింది. దీంతో ఆయన కూడా గురువారం ఉపవాసం ఉండడం ప్రారంభించారు. అక్షతా మూర్తి అత్త సోమవారం ఉపవాసం ఉంటే.. అల్లుడు గురువారం ఉపవాసం ఉంటున్నారు" అని సుధామూర్తి వివరించారు.

నారాయణమూర్తి, సుధామూర్తి కుమార్తె అయిన అక్షతామూర్తిని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ప్రధాన మంత్రిగా త్వరగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్‌లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో అక్షతా మూర్తి శక్తిమంతమైన మహిళగా ఉన్నారు.

rishi sunak marriage picture
రిషి సునాక్​- అక్షతా మూర్తి పెళ్లి ఫొటో

భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌కు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన అభిమానం. వీలు చిక్కినప్పుడల్లా దేవాలయాలను సందర్శించుకోవడం సహా భారతీయ పండగలను రిషి కుటుంబం ఘనంగా చేసుకుంటుంది. తండ్రి బాటలోనే రిషి కుమార్తె కూడా భారతీయ కళల పట్ల మక్కువ చూపుతోంది. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క సునాక్.. మన సంప్రదాయ నృత్యాల్లో ఒకటైన కూచిపూడిలో శిక్షణ తీసుకుంటోంది. నేర్చుకోవడం మాత్రమే కాదు.. గతేడాది లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో అనౌష్క నృత్య ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకుంది. "కుటుంబం, ఇల్లు, సంస్కృతి సంప్రదాయాలు మిళితమైన దేశం భారత్‌. అక్కడకు వెళ్లడం నాకు చాలా ఇష్టం" అని రిషి సునాక్​ కుమార్తె ఉత్సాహంగా చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.