ETV Bharat / state

Bandi Sanjay at Banjara Utsavam: అధికారంలోకి వచ్చాక తండాలను అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

author img

By

Published : Nov 14, 2021, 6:07 PM IST

2023లో భాజపా అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. భాజపా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బంజారా ఉత్సవ్ కార్యక్రమంలో(BJP Leaders in Banjara Utsavam) హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

BJP Leaders in Banjara Utsavam
బంజారా ఉత్సవ్ కార్యక్రమంలో బండి సంజయ్, ఈటల రాజేందర్

తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే అన్ని తండాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) స్పష్టం చేశారు. ప్రతి తండాలో సేవాలాల్ మహరాజ్ దేవాలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మన ముఖ్యమంత్రికి సేవాలాల్, కుమురం భీం లాంటి వాళ్లు జయంతి వస్తేనే గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. భాజపా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బంజారా ఉత్సవ్ కార్యక్రమంలో(BJP Leaders in Banjara Utsavam) ఆయన మాట్లాడారు.

బంజారా ఉత్సవ్ కార్యక్రమంలో బండి సంజయ్, ఈటల రాజేందర్

గిరిజనుల అభివద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు గిరిజన యువకుడు ప్రవీణ్ నాయక్ ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నేడు సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. గిరిజన తండాలలో కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్లు కట్టించిందని బండి సంజయ్(Bandi sanjay) వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ పనిచేస్తుంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్​హౌస్​లో సేదతీరుతున్నాడని మండిపడ్డారు. గిరిజనులు చైతన్యం అయినపుడే రాజకీయ పార్టీలు తండాలకు వస్తాయని.. అపుడే అభివృద్ది జరుగుతుందన్నారు.

నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారు: ఈటల

ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela rajender) విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా మాట తప్పారని మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రం ఏర్పాటుకు ముందు గిరిజనులను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నా సీఎం కేసీఆర్... ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గిరిజన దేవాలయాలకు దీప, ధూప నైవేద్యాలకి నిధులు ఇవ్వాలని... దళిత బంధులాగే గిరిజనుల్లో ప్రతి కుటుంబానికి రూ. 10లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్(etela rajender) డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ లాంబాడీ గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారాల చిత్రం 'గోర్​మాటి' పోస్టర్లను ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

మీ అందరికి వాస్తవాలు తెలియాలే. నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గుడిసెల్లో 5 మందికి పైగా నివసిస్తుంటే వారికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 4.80 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని తండాల్లో రెండు పడక గదుల ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలి. పదివేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఉచిత విద్యతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీనే. మన దేశంలో పేదలెవరూ ఆకలితో ఉండకూడదన్నదే ప్రధాని లక్ష్యం. ప్రతి ఒక్కరూ తలెత్తుకుని తిరగాలి. శక్తివంతమైన సమాజం కోసం మోదీ కృషి చేస్తుంటే మన రాష్ట్రంలో దానికి భిన్నంగా పాలన సాగిస్తున్నారు. కేవలం సేవాలాల్ జయంతి, కుమురం భీం జయంతి వస్తేనే మన సీఎంకు గుర్తుకొస్తారు. బంజారాల ఉత్సవం సందర్భంగా మన సమస్యలు పరిష్కరించే పార్టీ వైపు నిలబడండి. మీరు ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ నాయకులే మీ తండాకు వస్తారు.- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న బంజారాల స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి. పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువత పీజీలు, పీహెచ్​డీలు చేసి ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న హామీ ఇచ్చి మాట తప్పారు. ఇచ్చిన హామీలను సీఎం అమలు చేయాలి. ఓట్ల కోసం అనేక స్కీములు తెచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఓడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప.. ఓడ్డెక్కినాక బోడ మల్లప్ప అనడానికి సజీవ సాక్ష్యం హుజూరాబాద్. మాపై అనేక నిందలు మోపారు. దళితబంధు ఆపాలని లేఖలు రాసినట్లు అసత్యాలు ప్రచారం చేశారు. రాబోయే కాలంలో మనం మోసపోకుండా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా భాజపాను గెలిపించేందుకు మనం కృషి చేయాలి- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

Bandi Sanjay: రేపు జిల్లాల పర్యటనకు బండి సంజయ్..ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.