ETV Bharat / state

Telangana Budget 2022: హామీలకు పెద్దపీట.. మరోసారి భారీ పద్దు

author img

By

Published : Mar 5, 2022, 4:54 AM IST

Telangana Budget 2022: హామీల అమలుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కనుంది. ఉద్యోగ నియామకాల భర్తీకి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం పథకం ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ సహా ఇతర హామీల అమలుకు సరిపడా నిధులను బడ్జెట్‌లో కేటాయించే పరిస్థితి ఉంది. దళితబంధుకు భారీగా నిధులు ఇచ్చే సమకూర్చే అవకాశం ఉంది.

Budget
Budget

Telangana Budget 2022: రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ బడ్జెట్‌కు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడులు, జీఎస్​డీపీలో వృద్ధి, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మరోసారి భారీ పద్దునే ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2023 ద్వితీయార్థంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ సోమవారం ప్రవేశపెట్టే బడ్జెటే ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ కానుంది.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పద్దు కూర్పు ఎలా ఉంటుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు ఉండునున్నాయి. సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే హామీల అమలుకు సర్కార్ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు ఉండనున్నాయి.

ఉద్యోగ నియామకాలు...

కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియను బడ్జెట్‌ ద్వారా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ కోసం గత కొన్నాళ్లుగా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఖాళీల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తైంది. దాదాపు 70వేల వరకు ఖాళీలను మొదట గుర్తించారు. అయితే కొత్త పురపాలికలు సహా ఇతరత్రా అవసరాలు ఉన్న చోట్ల కూడా అవసరమైన ఉద్యోగాలను గుర్తించారు. దీంతో ఈ సంఖ్య ఇంకాస్తా పెరిగే అవకాశం ఉంది. అటు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తైంది. పరస్పర బదిలీలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. వాస్తవానికి ఫిబ్రవరి నెలలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయన్న సంకేతాలు అందాయి. అయితే వివిధ కారణాల రీత్యా ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో బడ్జెట్‌ వేదికగానే ఉద్యోగాల నియామకాల విషయమై స్పష్టత ఇచ్చి ప్రకటన చేస్తారని సమాచారం.

ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం...

పేదవాడి ఆత్మగౌరవంగా రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం... స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని సొంత జాగాల్లో నిర్మించుకునే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందిస్తామని 2020-21 బడ్జెట్‌లో ప్రకటించారు. కొవిడ్ వెలుగు చూడడంతో అది సాధ్యం కాలేదు. 2021-22 బడ్జెట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం... కరోనా ప్రభావం కారణంగా వీలు పడలేదని పేర్కొంది. కొవిడ్ తదుపరి వేవ్‌లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ చేపట్టలేదు. దీంతో సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం అంశం ఈసారి బడ్జెట్‌లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య ఫించన్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తూ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే అది ఇంకా అమలు కాలేదు. దీంతో ఈసారి ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించడంతో పాటు కొత్త ఫించన్ల మంజూరుపై కూడా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

రుణమాఫీకి సైతం...

రైతు రుణమాఫీకి సంబంధించి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ ప్రకటించిన సర్కార్... దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణాల మాఫీని అమలు చేశారు. మిగతా రుణాల మాఫీకి సంబంధించి నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా దళితబంధు పథకం కోసం నిధులు భారీగానే కేటాయించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.