ETV Bharat / state

Dharani: ఆ భూములపై అయోమయం.. ధరణి పోర్టల్‌లో వివరాలెందుకు లేవు? రుణాలెందుకు అందట్లేదు?

author img

By

Published : Oct 11, 2021, 8:46 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్ట్​ భూములపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి భూమిపై శాశ్వత హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఈ భూములను తెగనమ్ముకుంటున్న దుస్థితి కూడా ఏర్పడింది. ధరణి పోర్టల్‌లో వాటి వివరాలు లేక రుణాలు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి పొందిన ఎసైన్డ్‌ భూమిపై పదేళ్ల అనంతరం లబ్ధిదారులకు శాశ్వత హక్కులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Assigned land problems
ఎసైన్డ్‌ భూములపై అయోమయం

ఎసైన్డ్‌ భూములపై హక్కుల విషయం ఎటూ తేలడం లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం 2014 వరకు పంపిణీ చేసింది 21.36 లక్షల ఎకరాలకుపైగానే ఉంది. ఈ భూమిపై శాశ్వత హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నారు. కొందరు ఈ భూములను తెగనమ్ముకుంటున్న దుస్థితి కూడా ఉంది.

ప్రభుత్వం నుంచి పొందిన ఎసైన్డ్‌ భూమిపై పదేళ్ల అనంతరం లబ్ధిదారులకు శాశ్వత హక్కులు కల్పించాలి. దీనికోసం అధీన ధ్రువీకరణ పత్రం (ఓఆర్సీ) జారీ చేసిన అనంతరం పట్టాపాసుపుస్తకం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు. 2017 సెప్టెంబరు అనంతరం జారీ చేసిన కొత్త పట్టా పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్‌ అమల్లోనూ ఎసైన్డ్‌ లబ్ధిదారులను పక్కన పెట్టారు. దాదాపు ఐదు లక్షల ఎకరాలకు పైగానే పాసుపుస్తకాలు జారీ కావాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో 2017 నుంచి బ్యాంకు రుణాలు, రైతుబంధు, బీమా, రుణాల రద్దు పథకాలకు వారు దూరమయ్యారు. భద్రాద్రి, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఓఆర్సీ జారీచేసినా ధరణి పోర్టల్లో భూముల వివరాలను రెవెన్యూశాఖ చేర్చలేదు.

పరిహారమూ తక్కువే

పిల్లల పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, తదితర అవసరాల కోసం కొందరు గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నారు. చట్టం ప్రకారం ఎసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు, దానం, బహుమతి, స్వాధీనం లాంటివి చెల్లవు. అయినప్పటికీ తక్కువ ధరకు వస్తున్నాయని కొందరు కాజేస్తున్నారు. లబ్ధిదారులు వలసపోయిన చోట, మరణించిన సంఘటనల్లో కొన్ని భూములు కబ్జాల పాలయ్యాయి. ఇలా రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారికంగానే గుర్తించారు. ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు భూ సేకరణలో ఎసైన్డ్‌ భూములకు చెల్లిస్తున్న పరిహారమూ తక్కువగా ఉంటోంది. చేతులు మారిన ప్రభుత్వ భూముల గుర్తింపు, తిరిగి కేటాయింపునకు వీలుగా 2019లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలు అప్పగించింది. నియోజకవర్గ ఎమ్మెల్యే నేతృత్వంలో ఉండే ఎసైన్డ్‌ కమిటీలను రద్దు చేసి ఆ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు జిల్లాల్లో నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు మాత్రం తీసుకోలేదు.

ఎసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా చెల్లవు. అయినప్పటికీ కొందరు అడ్డదారుల్లో భూముల రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, ఖమ్మం, మెదక్‌ తదితర జిల్లాల్లో కబ్జాదారులు ఎకరాల కొద్దీ ఆక్రమించారు.పట్టా భూమిని ఆనుకుని ఉండే ఎసైన్డ్‌ భూములకు ఇతర సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

ఇదీ చూడండి: CM KCR: 'పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.