ETV Bharat / state

CM KCR: 'పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి'

author img

By

Published : Oct 9, 2021, 8:12 PM IST

Updated : Oct 9, 2021, 9:10 PM IST

పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం
పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం

20:07 October 09

పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం

పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించారు. రాష్ట్రంలోని పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.

గజం భూమి కూడా అన్యాక్రాంతం కావొద్దు..

అడవుల నడిమధ్యలో పోడు సాగు ఉండొద్దని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. నడి అడవిలోని పోడు సాగును మరో చోటకు తరలించాలన్న ముఖ్యమంత్రి.. అలాంటి సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తామన్నారు. పోడు భూమి తరలించి ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.  సాగుకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్‌ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవహారం లెక్క తేలిన తర్వాత ఒక్క గజం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కావొద్దని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

అటవీ పరిరక్షణ కమిటీలను నియమించాలి..

  దురాక్రమణలు అడ్డుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యలకూ వెనకాడవద్దన్నారు. పోడు సమస్యపై అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలు నియమించి..విధివిధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.  

ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమ లక్ష్యం

 ఈనెల మూడోవారంలో పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలన్నారు. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించాలని.. ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన, అటవీశాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తించి.. అవసరమైన మేరకు కందకాలు తవ్వకంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని.. అడవులు ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమలక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: CM KCR Review on Podu Lands: పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Last Updated : Oct 9, 2021, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.