ETV Bharat / state

ఇంటర్​ పూర్తైందా... అయితే ఉద్యోగం చేసేయండి!

author img

By

Published : Apr 29, 2020, 7:50 PM IST

పిల్లలు ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేశారంటే చాలు ఆ తర్వాత చదువులకు అయ్యే ఖర్చుల గురించి చాలా మందికి కాస్త ఆందోళన మొదలవుతుంది. ఎన్ని వేలు, లక్షల రూపాయలను... ఫీజులు, ఇతర వ్యయాల కింద వెచ్చించాలో అని. అంతేకాదు ఉద్యోగాలు సాధించుకోడానికి ఎలాంటి కోర్సులు చదవాలో అనే ప్రశ్న ఎదురవుతుంది. కానీ అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఉచితంగా చదివించేసి, ఉద్యోగాన్నీ ఇచ్చేస్తాం అంటున్నాయి రక్షణ రంగాలు.

armed-force-job-offers-to-inter-students-with-free-accommodation
ఇంటర్​ పూర్తైందా... అయితే చదువుకుంటూనే ఉద్యోగం చేసేయండి.

సంస్థ గొప్పది... కోర్సు విలువైనదీ అయినప్పటికీ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందో, రాదో అనే ఒత్తిడి అందరికీ ఉంటుంది. ఫీజు, ఇతర ఖర్చులకు రూ. లక్షల్లో వ్యయం. ఉద్యోగం వస్తుంది అనే భరోసా లేకపోయినా చదువు ఆపడం సాధ్యం కాదు. కానీ కోర్సులోకి చేరకముందే ఉద్యోగం ఖాయమనే అభయం దొరికితే.. రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఆ అవకాశం ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఉంది. అదీ ఫీజులు లేకుండానే. వసతి, భోజనము కూడా ఉచితమే. కోర్సు, శిక్షణ విజయవంతంగా దాటేస్తే ఉన్నతశ్రేణి కొలువు సిద్ధంగా ఉంటుంది.

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పరీక్షలతో రక్షణ రంగంలో మంచి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రకటన ఒక్కోటి ఏడాదికి రెండుసార్లు వెలువడుతుంది. ఎంపికైనవారు బీఏ లేదా బీఎస్సీ లేదా బీటెక్‌ కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. ఉత్తీర్ణులకు న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది.

ఏ ప్రకటన ద్వారా ఎంపికైనప్పటికీ సమాన హోదా ఉన్న (లెవెల్‌-10) ఉద్యోగాలను అందుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం వస్తుంది. దీంతోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు, అలవెన్సులు దక్కుతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్‌ ఉద్యోగాలైన లెఫ్టినెంట్‌, సబ్‌-లెఫ్టినెంట్‌, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభించవచ్చు.

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఆబ్జెక్టివ్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో విడతలో 400 మందికి పైగా అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో బీఏ/ బీఎస్సీ/ బీటెక్‌ చదువుకుంటూ... రక్షణ దళాలకు అవసరమైన ప్రాథమిక శిక్షణను పూర్తిచేసుకుంటారు.

నేవల్‌ అకాడమీ ఎంచుకున్నవారు కేరళలోని ఎజిమాలలో బీటెక్‌లో అప్లయిడ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌), ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఏదో ఒకదాన్ని అభ్యసిస్తారు. ఎన్‌డీఏలో చదువు, శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు... ట్రేడ్‌ శిక్షణను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో పొందుతారు. ఈ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్ట్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ తర్వాత విధుల్లోకి తీసుకుంటారు.

అర్హత: ఆర్మీ ఉద్యోగాలకు ఇంటర్‌ ఏ గ్రూప్‌లోనైనా ఉత్తీర్ణత పొందిన వారు.

నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవల్‌ అకాడమీ ఖాళీలకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్ట్​లతో ఇంటర్‌ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు బాలురు మాత్రమే అర్హులు.


ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 మ్యాథ్స్‌ 300 మార్కులకు, పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీ 600 మార్కులకు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లు ఉంటాయి. అన్ని విభాగాల్లోనూ చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సులోకి తీసుకుంటారు.
ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు జనవరి, జూన్‌లో వెలువడతాయి.
వెబ్‌సైట్‌:https://upsc.gov.in

నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా... ఇండియన్‌ నేవీ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో బీటెక్‌ ఉచితంగా చదువుకోవచ్చు.

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. జేఈఈ మెయిన్‌లో అర్హత పొంది ఉండాలి.
వయసు: 17 - 19 1/2 ఏళ్ల లోపు ఉండాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.


ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ- మెయిన్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి చేపడతారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్‌ టెస్టు, వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వీరు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ-ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతారు.
ప్రకటనలు: ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబరుల్లో వెలువడతాయి.
వెబ్‌సైట్‌: ‌www.joinindiannavy.gov.in

ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ

ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని ఇండియన్‌ ఆర్మీ అందిస్తోంది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. విజయవంతంగా కోర్సు, శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం తప్పనిసరి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారికి అయిదు రోజులుపాటు రెండు దశల్లో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలుంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని మెడికల్‌ టెస్టుకు పంపుతారు. అందులోనూ విజయవంతమైతే కోర్సులోకి తీసుకుంటారు. వీరు ఎల‌క్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఎంచుకోవచ్చు.


నోటిఫికేషన్లు: ఏడాదికి రెండు సార్లు. మే/జూన్‌, నవంబరు / డిసెంబరుల్లో
వెబ్‌సైట్‌: ‌www.joinindianarmy.nic.in

ఇదీ చూడండి: త్వరలో సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.