ETV Bharat / state

ఏపీ కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

author img

By

Published : Nov 5, 2020, 11:16 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు వివరించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. నవంబర్ 17న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, నవంబర్ 24 న జగనన్న తోడు పథకం ప్రారంభం కానుందని వెల్లడించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

  • వెయ్యి కోట్ల రూపాయలతో భూముల రీసర్వే

'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్షణ' పేరుతో సమగ్ర రీ-సర్వే చేపట్టాలని ఏపీ కేబినెట్ సమావేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని భూముల్లో రీ-సర్వే చేయనున్నట్టు మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రూ. 1,000 కోట్లు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదించినట్టు తెలిపారు. వచ్చే జనవరి నుంచి 2023 జూన్‌ నాటికి దశలవారీగా రీ-సర్వే పూర్తి చేస్తామన్నారు.

  • ఇక నుంచి ఆఫ్​లైన్​లోనూ ఇసుక..

నూతన ఇసుక విధానానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇసుకను ఇక నుంచి ఆఫ్‌లైన్‌లోనూ.. సొంత వాహనాల్లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎస్‌ఈబీని బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. ఎస్‌ఈబీకి అదనపు పోస్టులు కేటాయించామన్న మంత్రి.. డ్రగ్స్‌, గుట్కా, ఇతర మత్తుపదార్థాలను ఎస్‌ఈబీ పరిధిలోకి తెచ్చామన్నారు. ఎస్‌ఈబీకి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.

  • జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. బియ్యం సంచులు పక్కదారి పట్టకుండా క్యూఆర్ కోడ్ వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. పాడిపరిశ్రమను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.

  • మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 5,700 కోట్లు

మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై కేబినెట్‌లో చర్చించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. రూ. 5,700 కోట్లతో పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో తేదీలు ఖరారు కాలేదు. ఈ నెలలోనే శాసనసభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • ఈ నెల 24 న జగనన్న తోడు పథకం ప్రారంభం

'జగనన్న తోడు' ద్వారా చిరువ్యాపారులకు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. 'జగనన్న తోడు' కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 24న జగనన్న తోడు పథకం ప్రారంభంకానుందని వెల్లడించారు. ఈ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు అందచేస్తున్నామని తెలిపారు.

  • పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు..

500 లీటర్ల కంటే ఎక్కువగా పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకే వద్దే పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు కెబినెట్ ఆదేశించింది. పశువుల దాణాను ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు నిర్ణయించింది.

  • ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కేబినెట్ ఆమోదం

ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల సమగ్ర రీ-సర్వేపై చర్చ జరిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రీ-సర్వే కోసం రూ. 1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి చేస్తామని తెలిపింది. 4,500 సర్వే టీములను సిద్దం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నామని మంత్రి తెలిపారు.

  • వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నవంబర్ 17న ప్రారంభం

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోని సున్నా వడ్డీ బకాయిలు రూ. 1,051 కోట్లు కూడా ఇప్పుడు చెల్లించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఏ సీజనులో జరిగిన పంట నష్టానికి ఆ సీజనులోనే అందిస్తున్నామన్నారు. అక్టోబర్ పంట నష్టం పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి అవుతుందన్నారు. ఈ నెలాఖరులోగానే ఇన్​పుట్ సబ్సిడీని అందించనున్నామని తెలిపారు.

  • ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తాం

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్టేడియాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి భూ కేటాయింపులు చేస్తున్నామన్నారు.

  • జైళ్ల నుంచి మహిళల విడుదలకు కేబినెట్ ఆమోదం

ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి కలగనుంది. వారి విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోసం దస్త్రాన్ని కూడా ప్రభుత్వం పంపింది.

  • వైద్యారోగ్యశాఖ టీచింగ్ స్టాఫ్‌కు యూజీసీ స్కేల్ అమలుకు నిర్ణయం

వైద్యారోగ్య శాఖలోని టీచింగ్ స్టాఫ్​కు యూజీసీ స్కేల్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా ప్రభుత్వం పై భారం పడుతుంది. 3,500 మందికి లబ్ది కలుగుతుంది.

  • విశాఖలో 150 ఎకరాల్లో అదానీ డేటా సెంటర్‌కు కేంద్రం అంగీకారం

విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం లభించింది. 150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. అదానీ డేటా సెంటర్ వెళ్లిపోయిందని చంద్రబాబు చేసిన విమర్శలు నిజం కాదని తేలిపోయిందని మంత్రి కన్నబాబు అన్నారు. వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని అర్హులకు సంక్షేమ పథకాల వర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఈనెల 6 నుంచే ప్రారంభించనున్నామన్నారు.

  • నవంబర్ 10 నుంచి మరో ఆరు జిల్లాల్లో.. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నవంబర్ 10 నుంచి మరో ఆరు జిల్లాల్లో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: 'తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.