కొవిడ్‌ సవాలుకు శాశ్వత పరిష్కారం దిశగా భారత్​ బయోటెక్​

author img

By

Published : May 11, 2022, 11:57 AM IST

permanent solution to covid

అన్ని ఉత్పరివర్తనాలపై పనిచేసే టీకా ఆవిష్కరణకు భారత్‌ బయోటెక్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీనకిి రూ.150 కోట్లు సీఈపీఐ సమకూర్చనుంది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఈ ప్రాజెక్టును యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, స్విట్జర్లాండుకు చెందిన ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏతో కలిసి చేపడుతుంది.

permanent solution to covid by bharat biotech: కరోనా వైరస్‌ అన్ని రకాల (ఉత్పరివర్తనాలు-వేరియంట్ల)పై పనిచేసే టీకా అభివృద్ధి చేయడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ నడుంకట్టనుంది. ఇందుకోసం ఈ సంస్థకు 19.3 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) సమకూర్చేందుకు సీఈపీఐ (ద కొయిలేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌) అనే సంస్థ ముందుకు వచ్చింది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఈ ప్రాజెక్టును యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, స్విట్జర్లాండుకు చెందిన ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏతో కలిసి చేపడుతుంది. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ వేరియంట్లు, ఇతర బీటా కరోనా వైరస్‌లపై సమర్థంగా పనిచేసే టీకాలను ఆవిష్కరించడం కోసం సీఈపీఐ 200 మిలియన్‌ డాలర్ల నిధి సేకరించింది. దీని నుంచి వివిధ పరిశోధన సంస్థలకు అవసరమైన కేటాయింపులు చేస్తోంది. ఇమ్యునోజెన్‌ డిజైన్‌, ప్రీక్లినికల్‌ అధ్యయనాలు, టీకా అభివృద్ధి, ఉత్పత్తి, ఫేజ్‌-1 క్లినికల్‌ పరీక్షల.. వరకు ఆయా సంస్థలు చేపట్టే ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంది.

మరికొన్నేళ్లు ముప్పు తప్పదా... ‘ఇప్పటికే మూడు దశల్లో కొవిడ్‌ ముప్పు తలెత్తిన పరిస్థితిని విశ్లేషిస్తే, వచ్చే కొన్నేళ్ల పాటు కరోనా వైరస్‌తో మానవాళికి ఎప్పుడైనా సవాలు ఎదురుకావచ్చని స్పష్టమవుతోంది. తత్ఫలితంగా ఇప్పటి వరకు సాధించిన వ్యాధి నిరోధకత ప్రశ్నార్థకం కావచ్చ’ని సీఈపీఐ సీఈఓ రిఛర్డ్‌ హ్యాట్‌చెట్‌ వివరించారు. అందువల్ల కరోనా వైరస్‌ వేరియంట్‌ ఎటువంటిదైనా, దానిపై సమర్థంగా పనిచేసే టీకాను ఆవిష్కరించడం కీలకమని అన్నారు.

bharat biotech News: దావోస్‌ కేంద్రంగా సీఈపీఐ: సీఈపీఐ దావోస్‌ కేంద్రంగా 2017లో ఏర్పాటైంది. ఇది ప్రభుత్వ- ప్రైవేటు- స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థల సంయుక్త సంస్థ. భవిష్యత్తు ఆరోగ్య సమస్యలకు టీకా పరిష్కారాలు అన్వేషించడం ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థను నెలకొల్పారు. భారత్‌ బయోటెక్‌తో చేతులు కలిపినట్లుగానే ఈ సంస్థ ఇప్పటికే 8 భాగస్వామ్యాలకు నిధులు అందించేందుకు ముందుకు వచ్చింది. మిగ్‌వ్యాక్స్‌ లిమిటెడ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ శాస్కత్‌చెవన్స్‌ వాక్సిన్‌ అండ్‌ ఇన్‌ఫెక్టియస్‌ డిసీజ్‌ ఆర్గనైజేషన్‌, అఫినివ్యాక్స్‌, ఎస్‌కే బయోసైన్స్‌, బయోనెట్‌, ఎన్‌ఈసీ కార్పొరేషన్‌.. తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, భారత ప్రభుత్వంతో కలిసి చేపట్టిన చికన్‌గున్యా టీకా (బీబీవి87) అభివృద్ధి కార్యక్రమానికి సీఈపీఐ చేయూతనిస్తోంది. దీనికి 14.1 మిలియన్‌ డాలర్లు మంజూరు చేసింది. ఈ టీకాపై కోస్తారీకాలో క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

- డాక్టర్‌ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ సీఎండీ

భవిష్యత్తు వేరియంట్ల నుంచీ రక్షణ కోసమే: ‘మనకు తెలిసిన కరోనా వైరస్‌ రకాలపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే వైరస్‌ వేరియంట్ల నుంచి కాపాడుకోవటం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. కొవిడ్‌ వైరస్‌ అన్ని వేరియంట్ల నుంచి రక్షణ నిచ్చే టీకా తీసుకురావటమే దీనికి పరిష్కారం. కొత్త టీకాలను ఆవిష్కరించడంలో, దానికి సంబంధించిన పరిశోధనా కార్యకలాపాల్లో మాకు విశేష అనుభవం ఉంది. సీఈపీఐ, ఎక్సెల్‌జీన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ సహకారంతో కరోనా వైరస్‌ సవాలుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే యత్నాల్లో నిమగ్నమవుతున్నాం’. - డాక్టర్‌ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.