ETV Bharat / state

రైతుల నడ్డివిరుస్తున్న పంట రుణాలు.. అసలు కంటే వడ్డీలే ఎక్కువ!

author img

By

Published : Jan 21, 2022, 12:48 PM IST

Updated : Jan 21, 2022, 2:35 PM IST

Farmers loan waiver problems, loan waiver in telangana
రైతుల నడ్డివిరుస్తున్న పంట రుణాలు

Farmers loan waiver problems : రైతులపై పంటరుణ భారం పేరుకుపోతోంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సకాలంలో పూర్తికాకపోడం వల్ల... తీసుకున్న అప్పులో అసలు కంటే వడ్డీలే అధికవుతున్నాయి. ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో ఉన్న కర్షకులకు... బ్యాంకులు రుణాలను రెన్యూవల్ చేసుకోకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. రైతుబంధు సొమ్ము తీసుకోవాలన్న... రెన్యూవల్ చేసుకోనిదే బ్యాంకులు ఇవ్వడంలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Farmers loan waiver problems : పంట రుణ వడ్డీలు రైతుల నడ్డివిరుస్తున్నాయి. రుణమాఫీ సకాలంలో పూర్తికాకపోవడం వల్ల అన్నదాతలకు రుణ తిప్పలు తప్పడం లేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 2 లక్షల 38 వేలకుపైగా రైతులకు ఖాతాలు ఉండగా....... లక్షా 92 వేల మంది వివిధ బ్యాంకుల నుంచి పంటరుణాలు పొందారు. జిల్లాలో సుమారు రెండున్నర వేలకోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 85.56 శాతం మేర ఇచ్చారు.

అన్నదాతల్లో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 14 వేల రైతులకు ఖాతాలుండగా...... 268 కోట్ల మేర రుణం తీసుకున్నారు. వారిలో 25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీచేసింది. 50 వేల లోపు ఉన్న రుణాల్లో... కొంతవరకు మాఫీ అయ్యాయి. మిగిలిన రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ... అధిక మందికి రుణమాఫీ కోసం నిరీక్షణ తప్పట్లేదు. మాఫీప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందన్న అంశంపై స్పష్టత లేకపోడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

యాభైవేల రూపాయల లోన్ తీసుకుంటే లక్షా ఆరు వేలు చేశారు. ఇంతవరకు మాఫీ కాలేదు. తోట వేస్తే మొత్తం పాడైయింది. పూత అంతా రాలిపోతోంది. మూడెకరాల తోట వేశాం. అరకెరం పంట కూడా రావడం లేదు. మిర్చి వేస్తే నష్టాలే మిగులుతున్నాయి. వడ్ల పంట వేస్తామంటే కొనబోమని అంటున్నారు.

-మహిళా రైతు

రుణమాఫీ కోసం ఎదురుచూపులు

ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఎక్కువమంది రైతులు రుణాలను రెన్యూవల్‌ చేయించుకోలేదు. రెన్యూవల్‌ చేయిస్తే రుణమాఫీ వర్తించదన్న ఉద్దేశ్యంతో... బ్యాంకుల వైపునకు వెళ్లట్లేదు. రుణాల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్ మెంట్ ప్రకటించినా అన్నదాతలు.. మాఫీ ఆశతో ముందుకు రాలేదు. ఏళ్లుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండటం.. అవి పూర్తికాకపోవడం వల్ల ఏటేటా వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు ఇచ్చిన రుణాల కన్నా... వడ్డీలే అధికంగా అయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతు బంధు రూ.20వేలు వచ్చినయ్. వాటిని హోల్డ్​లో పెట్టారు. బయటకు రావడం లేదు. లోను కట్టాలి. రూ.90 వేలు తీసుకుంటే రూ.30 వేలు వడ్డీ చేశారు. వాటిని రిన్యూవల్ చేస్తే డబ్బులు ఇస్తామంటున్నారు. కరోనా రోజుల్లో బ్యాంకుల చుట్టూ తిరగకలేకపోతున్నాం. రైతుబంధు వచ్చినా ఉపయోగం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.

-రైతులు

వేడుకుంటున్న అన్నదాతలు

రుణాలను రెన్యూవల్ చేసుకోవడం వల్ల మేలు జరుగుతుందని రైతులకు బ్యాంకర్లు సూచిస్తున్నాయి. వడ్డీ భారం తగ్గాలంటే రెన్యూవల్‌ చేయించుకోవాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ పూర్తిచేస్తేనే రైతులకు కాసింత ఊరట దక్కే అవకాశం ఉంది. లేకపోతే పంట రుణాల రూపంలో రెట్టింపు వడ్డీ భారం తప్పేలా లేదని అన్నదాతలు వేడుకుంటున్నారు.

రైతుల నడ్డివిరుస్తున్న పంట రుణాలు

ఇదీ చదవండి: Rythu Bandhu: ఇప్పటి వరకు అందిన రైతుబంధు సాయం ఎంతంటే?!

Last Updated :Jan 21, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.