ETV Bharat / state

'KTR నోటీసులకు భయపడేదే లే.. రాజకీయంగా పోరాడతాం'

author img

By

Published : Mar 24, 2023, 9:15 AM IST

Bandi Sanjay Responded to KTR Notices: మంత్రి కేటీఆర్‌ తనకు లీగల్‌ నోటీసులు పంపినట్లు వస్తున్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. వీటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. చట్టపరంగా తగిన సమాధానమిస్తామని అన్నారు. నోటీసులు రాజకీయంగా ఎదుర్కొంటామే తప్ప.. వెనక్కి తగ్గమని ఆయన స్పష్టం చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Responded to KTR Notices: మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు ప్రసారమవుతున్నాయని.. వీటికి భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. చట్టపరంగా, న్యాయబద్ధంగా తగిన సమాధానమిస్తామని తెలిపారు. రాజకీయంగా, ప్రజాక్షేత్రంలో పోరాడతాం తప్ప.. కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వివరించారు. కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే దాకా పోరాడతామని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌తో తనకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం పెద్ద జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి, సీఎస్, టీఎస్‌పీఎస్సీ అధికారులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప కమిషన్‌ తప్పిదం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. లీకేజీ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని ఏ విధంగా ఆరోపణలు చేస్తారని నిలదీశారు.

అన్ని శాఖల తరఫున కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు: రాష్ట్రంలోని అన్ని శాఖల తరఫున కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రిగా ఉంటూ ఆయన స్పందిస్తే తప్పు లేనప్పుడు.. ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా తాము మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సాంప్రదాయానికి కేటీఆర్ తెరలేపడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణచి వేసే కుట్రలో భాగమే ఇదని ఆరోపించారు.

వెనక్కి తగ్గం: రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే.. బెదిరించడం, కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేయించడం అలవాటుగా మార్చుకుందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వీటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. చట్టబద్ధంగా, న్యాయపరంగా నోటీసులకు సమాధానమిస్తామని వివరించారు. వీటిని రాజకీయంగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.

కేంద్రం పైసా ఇవ్వలేదనడం విడ్డూరం: పంట నష్టం కింద రైతులకు కేంద్రం పైసా సాయం చేయలేదని.. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని బండి సంజయ్ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 సాయం.. చాలా గొప్ప విషయమని ఆయన చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్ఎఫ్‌ నిధుల నుంచి రైతులకు పంట పరిహారం చెల్లిస్తోందని తెలిపారు. ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే అని పేర్కొన్నారు. అయినా కేంద్రంపైసా ఇవ్వలేదని వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం బాగోలేదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇన్ని రోజులు ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాలను దారి మళ్లించేందుకు జాతీయ సమగ్ర పంటల విధానాన్ని రూపొందించాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లయినా ఇంత వరకు సమగ్ర పంటల విధానాన్ని, బీమా పాలసీని తీసుకురాకుండా కేంద్రంపై బురద చల్లడం సిగ్గు చేటని విమర్శించారు. మరోవైపు బండి సంజయ్‌ నేడు సిట్‌ విచారణకు హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయంపై జీవో జారీ.. ఏప్రిల్​ 15 నుంచే..

యాక్సెంచర్ ఉద్యోగులకు షాక్​.. 19వేల మందిపై వేటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.