ETV Bharat / state

భద్రాద్రి ఆలయంలోనే సీతారాముల పట్టు వస్త్రాల తయారీ

author img

By

Published : Mar 12, 2023, 4:25 PM IST

Bhadradri
Bhadradri

setharamula kalyanam at Bhadradri: భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 30న జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే 180 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయగా.. కల్యాణానికి వాడే పట్టువస్త్రాలను ఎంతో పవిత్రంగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో ఆలయ ప్రాగణంలోనే తయారు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రతువును ఇవాళ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

setharamula kalyanam at Bhadradri: దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్య ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి జరగబోయే కల్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణంలో వాడే 180 క్వింటాళ్ల తలంబ్రాలను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. స్వామి వారి కల్యాణానికి వాడే పట్టు వస్త్రాలు పవిత్రంగా నియమనిష్ఠలతో ఆలయం వద్దనే తయారు చేయాలని నిర్ణయించారు.

దీనికి సికింద్రాబాద్​లోని గణపతి దేవాలయం ఛైర్మన్, రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్.ఎస్. జయరాజు భద్రాద్రి రామయ్య సన్నిధిలో మగ్గంతో స్వయంగా సీతారాములకు పట్టు వస్త్రాలు తయారుచేసి ఇవ్వడానికి ముందుకొచ్చారు. పద్మశాలీల సహకారంతో అనేక దేవాలయాలకు ఉచితంగా పట్టు వస్త్రాలు తయారు చేసి అందిస్తున్న ఆయన గత ఏడాది కూడా సీతారాముల కల్యాణానికి ఆలయంలోనే పట్టు వస్త్రాలు తయారు చేశారు.

Bhadradri
Bhadradri

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం పట్టుపోగులకు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇవాళ రామయ్య సన్నిధికి తీసుకొచ్చారు. ఆలయంలో మగ్గానికి పూజలు చేసిన అనంతరం వస్త్రాల తయారీని ప్రారంభించారు. ప్రస్తుతం 4600 పోగులతో ఐదు రంగులలో ఆకర్షణీయమైన పట్టుచీరను సీతమ్మవారికి తయారు చేస్తున్నారు. కళ్యాణంతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి సీతారాములకు, లక్ష్మణ, హనుమంతులకు పట్టు వస్త్రాలనూ భద్రాద్రిలోనే తయారుచేసి ఇవ్వనున్నారు.

Bhadradri
Bhadradri

Bhadradri Sitaram Silk clothes: మొత్తం ఎనిమిది మంది చేనేత నిపుణులు ఈరోజు నుంచి వస్త్రాలు తయారీ ప్రారంభించి ఈనెల 25 లోపు స్వామివారి సన్నిధికి అందించనున్నారు. భద్రాచలంలోని భక్త రామదాసు జ్ఞాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసి అక్కడనే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈవో శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్​తో పాటుగా వస్త్రాల తయారీదారులు కరుణాకర్, ఉపేంద్ర గణేష్, శ్రీనివాస్, సురేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ పనులకు శ్రీకారం: సీతారాముల కల్యాణానికి సంబంధించి పనులను ఈనెల 9న ఆలయ అర్చకులు ప్రారంభించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారాములను ఆలయం వద్ద నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ రోలు రోకలికి పూజలు నిర్వహించారు. తదుపరి వైష్ణవ ముత్తైదువుల చేత పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలను తయారు చేయడానికి పనులు ప్రారంభించారు.

"దుకాణాలలో పట్టువస్త్రాలను కొనకుండా పవిత్రంగా స్వామివారి సన్నిధిలో తయారు చేసిన వస్త్రాలను స్వామివారికి ఇవ్వాలనే సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టటం స్వామి వారికి ఉచితంగా వస్త్రాలు అందించడం శుభ పరిణామం" - ఎస్ ఎస్ జయరాజు, సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్

ఇవీ చదవండి:

భద్రాద్రిలో మొదలైన కల్యాణ వేడుకలు.. ఇక్కడ తలంబ్రాలు ఎరుపుగా ఉండడానికి కారణం తెలుసా?

భక్తులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత... వైద్య పరీక్షలు చేస్తున్న ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.