ETV Bharat / state

భద్రాద్రిలో మొదలైన కల్యాణ వేడుకలు.. ఇక్కడ తలంబ్రాలు ఎరుపుగా ఉండడానికి కారణం తెలుసా?

author img

By

Published : Mar 9, 2023, 3:03 PM IST

Bhadradri Sri Sitaramula Talambra celebration: ఎన్నటికీ పాడుకానివి.. నాశనం లేనివి అక్షితలు. అన్ని శుభకార్యాల్లోనూ కల్యాణాల్లోనూ పసుపు రంగులో ఉండే తలంబ్రాలు వాడుతారు. కానీ రామయ్య సన్నిధిలో ఏడాదికి ఒకసారి జరిగే సీతారాముల కల్యాణానికి మాత్రం ఎరుపు రంగులో ఉండే తలంబ్రాలను వినియోగిస్తారు. అసలు ఎందుకు ఎరుపు రంగులో ఉండే తలంబ్రాలనే వాడతారు. అసలు ఈ తలంబ్రాలకు ఏం ప్రత్యేకత ఉందో ఒకసారి తెలుసుకుందాము.

bhadradri
bhadradri

Bhadradri Sri Sitaramula Talambra celebration: భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలకు ఏళ్ల చరిత్ర ఉంది. తానిషా కాలం నాటి నుంచి భక్త రామదాసు సీతారాముల కల్యాణం చేసే రోజుల్లో అప్పటి తానేషా ప్రభువు కల్యాణ తలంబ్రాలు కలపడానికి గోల్కొండ నుంచి బుక్క గులాములు పంపించేవారు. బియ్యంలో తానిషా ప్రభువు పంపించిన బుక్క, గులాములు, పసుపు, కుంకుమ, నెయ్యి, పన్నీరు, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేసేవారు. ఆనాటి కాలం నుంచి ఇప్పటివరకు భద్రాచలంలో ప్రతి ఏడాది జరిగే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను ఆ విధంగానే తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సుగంధ ద్రవ్యాలు గులాములు కలపటం వల్ల తలంబ్రాలు ఎరుపు రంగుగా మారి సువాసనను వెదజల్లుతాయి. వీటిని తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటీపడతారు.

180 క్వింటాళ్ల తలంబ్రాలు తయారీ: భద్రాద్రి రామయ్య సన్నిధిలో పాల్గున పౌర్ణమి సందర్భంగా ఈ నెల 30న జరగనున్న సీతారాముల కల్యాణానికి మంగళవారం నుంచి కల్యాణ పనులు ప్రారంభించారు. పాల్గున పౌర్ణమి సందర్భంగా సీతారాములకు అర్చకులు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మార్చి 30న జరగనున్న సీతారాముల కల్యాణానికి.. 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారందరికీ ఉచితంగా అందించడానికి 180 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. తలంబ్రాలు తయారు చేసే క్రమంలో మంగళవారం 10 క్వింటాళ్ల తలంబ్రాలను కలిపారు. 180 క్వింటాళ్లు తలంబ్రాలను రోజు ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా చిత్రకూట మండపంలో కలపనున్నారు.

సీతారాముల కల్యాణ పనులకు శ్రీకారం: కల్యాణం పనులను ప్రారంభించే క్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములను ఆలయం వద్ద నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మంగళ వాయిద్యాల నడుమ రోలు రోకలికి పూజలు నిర్వహించారు. తదుపరి వైష్ణవ ముత్తైదువుల చేత పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలను తయారు చేయడానికి పూనుకున్నారు. అనంతరం ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అందరూ తలంబ్రాలు కలిపి ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి బేడా మండపం వద్దకు తీసుకువెళ్లిన స్వామి వారికి డోలోత్సవం వేడుక వైభవంగా జరిగింది.

ఘనంగా వసంతోత్సవ వేడుకలు: లక్ష్మణ సమేత సీతారాములను ఉయ్యాలలో వేంచేపింపజేసి ఆలయ హరిదాసులు భక్త రామదాసు రచించిన కీర్తనలు పాడి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం వేడుక వైభవంగా నిర్వహించారు. తెల్లని వస్త్రాలు, బంగారు ఆభరణాలు పూలమాలలతో దర్శనమిచ్చిన స్వామి వారికి బుక్క గులాంలు కలిపిన వసంతాన్ని చల్లారు. ప్రధాన ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు వసంతాన్ని చల్లి వేడుకని నిర్వహించారు. స్వామివారికి చల్లిన వసంతాన్ని భక్తులకు అందించగా భక్తులంతా వసంతోత్సవ వేడుక ఘనంగా జరుపుకున్నారు.

25 నదుల నుంచి జలాలు సేకరణ: ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి ప్రవక్త సన్నాహిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 29న ఎదుర్కోలు మహోత్సవం, 30న సీతారాముల కల్యాణం, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 25నదీ జలాల తీర్థాలను ఆలయ అర్చకులు సేకరిస్తారు. ఈ క్రమంలో భాగంగా ఆలయంలోని మొత్తం తొమ్మిది మంది ఆలయ అర్చకులు వైదిక సిబ్బంది తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం వైపుకు వెళ్లి 25 నదులలోని నదీ జలాలను సేకరించి పది రోజుల తర్వాత భద్రాద్రికి చేరుకోనున్నారు.

పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం ప్రత్యేక యాగశాలను నిర్మిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా గోటితో వలసిన తలంబ్రాలను భక్తులు స్వామివారి కల్యాణానికి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి గోటితో వలిచిన తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.