ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షాలు... జలమయమవుతున్న జిల్లాలు

author img

By

Published : Aug 17, 2020, 4:43 AM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు.... జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు అలుగు పోస్తూ.... ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్భందమవ్వగా... వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయిదు జిల్లాల్లో పంటలు నీట మునిగాయని....వ్యవసాయశాఖ ప్రకటించింది.

heavy rains in telangana
ఎడతెరిపి లేని వర్షాలు... జలమయమవుతున్న జిల్లాలు

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చెరువులు వాగులు నిండు కుండలా జలకళను సంతరించుకున్నాయి. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి.. అలుగు పారుతుంది. గద్దపాక చెరువు పూర్తిగా నిండిపోయింది. సిరిసిల్లలోని మానేరు వాగులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రంగనాయక సాగర్ నుంచి తంగళ్లపల్లి నక్కవాగు ప్రాజెక్టులోకి వరద చేరి.. పరవళ్లు తొక్కుతోంది. వేములవాడలోని మూలవాగు నిండుగా ప్రవహిస్తుంది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో వరద నీటిలో ట్రాక్టర్ కొట్టుకుపోవడంతో జేసీబీ సాయంతో వెలికితీశారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ, మోయతుమ్మెద వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతారాంపూర్ తోటపల్లి కాలువకు గండి పడింది. జగిత్యాల జిల్లాలో 158.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టవర్ సర్కిల్‌లో రోడ్లు జలమయమై ....రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తడిసి ముద్దైన ఉమ్మడి ఆదిలాబాద్​

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముసురుపట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కురుస్తున్న వర్షాలతో పాటు... ఎగువ నుంచి వస్తున్న వరదతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మత్తడివాగు, సాత్నాలా, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు, ఎల్లంపల్లి , వట్టివాగు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చిచేరుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తుంతుంగ వాగు పొంగిపొర్లడంతో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరులోని సుద్దావాగు పొంగిపొర్లడంతో మండలంలోని 5 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని దిందావాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా దిందా గ్రామం జలదిగ్భందమైంది.

జలదిగ్బంధం

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు... ఉమ్మడి నిజామాబాద్‌లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డిలో చెరువులు నిండు కుండల మారాయి. లింగపూర్,తిమ్మకపల్లి చెరువులు మత్తడి దూకుతున్నాయి. జిల్లాలోని చిన్న చిన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కల్యాణి, సింగీతం ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. కల్యాణి ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 220క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా సుమారు 1,077 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది.లక్ష్మీ, సరస్వతి కాలువ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు.

నానుతున్న నల్గొండ

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భువనగిరిలో అత్యధికంగా 65.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామన్నపేట, ఆలేరు, గుండాల, రాజపేట, మోత్కూర్,ఆత్మకూరు, వలిగొండ, మండలాల్లో భారీ వర్షం కురిసింది. బీబీనగర్ మండలంలో మూసీ నదితో పాటు... వాగులు పొంగుతున్నాయి. రుద్రవల్లి, ముగ్దుమ్‌పల్లి గ్రామాల్లో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవణపల్లి చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఆలేరు పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు వంకలు పారుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేటలోనూ...

సిద్దిపేటలో కురుస్తున్న వర్షాలకు వాగులు పరవళ్లు పెడుతున్నాయి. జిల్లాలోని రాఘవపురంలో ఓ యువకుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వరద నీటిలో కొట్టుకుపోయాడు. వరంగల్‌లో నీటిలో చిక్కుకున్న వృద్ధ దంపతులను విపత్తు నిర్వహణ బృందాలు చాక చక్యంగా కాపాడారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న బృందాలు 90 నిమిషాల పాటు శ్రమించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇప్పటి వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎనిమిది మందికి కాపాడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.