ETV Bharat / state

ఆ ప్రాంతవాసులకు పగలేమో భానుడి భగభగ.. రాత్రేమో చలితో గజగజ

author img

By

Published : Mar 3, 2023, 7:55 PM IST

Etv Bharat
Etv Bharat

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. పగలు ఎండతో భరించలేని ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. రాత్రుల్లో చలితీవ్రత వణికిస్తోంది. ఇంకా ఏప్రిల్‌ మాసం రానేలేదు. కానీ మే మాదిరిగా భానుడు భగభగ మండుతుండటం జనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాతావరణమంతా వేరుగానే ఉంటోంది. వేసవిలో భరించలేని ఎండలు కాయటం, వర్షాకాలంలో భారీ వర్షాలు కురవటం, శీతాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికిపడి పోవటం సహజమే. కానీ ఈ ఏడాది రాత్రుల్లో చలితీవ్రత ఉంటే... పగలు భానుడి ఉగ్రరూపం జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, కెరమెరి, ఆసిఫాబాద్‌, బెజ్జూరులాంటి మండలాల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ప్రాంతాల్లో భరించలేని ఉక్కపోతతో జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వేడి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, శీతలపానీయాలకు డిమాండ్‌ పెరిగితే చలితీవ్రత ఎక్కువ ఉండటంతో ఇంకా ఉన్ని దుస్తుల కొనుగోళ్లు యధావిధిగానే కొనసాగుతుండటం జిల్లాలోని భిన్నమైన వాతావరణ స్థితిగతులకు అద్ధం పడుతుంది.

ఉత్తరాది నుంచి పగలంతా వేడిగాలులు వస్తుంటే... రాత్రుల్లో చలిగాలు వీస్తుండటంతోనే భిన్నమైన పరిస్థితులకు కారణమవుతోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని పెన్‌గంగ, గోదావరి, ప్రాణహిత, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో గతానికి భిన్నంగా వాతావరణం స్పష్టంగా ఉంటోంది.

పగటివేళ చాలా ఎండలు కొడుతున్నాయి. రాత్రి వేళలో విపరీతమైన చలి పెడుతోంది. శీతాకాలంలో ఏవిధంగానైతే చలి పెడుతుందో ఆవిధంగా ఈ వేసవికాలంలో రాత్రిపూట ప్రజలందరిని వణికిస్తోంది. జనవరి మాసంలో చలి ఉన్నట్లుగా ఈ నెలలో ఉంది. మే, ఏప్రిల్‌ నెలలో ఉండే ఎండలు ఈ మార్చి ఆరంభంలోనే మొదలయ్యాయి. పగటి వేళలో జనం రోడ్ల మీదకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయదారులకు, కూలీనాలీ చేసుకుని బతికేవారికి ఈఎండ వేడిమికి తట్టుకోలేక పోతున్నారు. -గద్దల శంకర్‌, జైనథ్‌ మండలం, ఆదిలాబాద్‌ జిల్లా

గత సంవత్సరం కన్నా ఈసారీ ఎక్కువగా ఎండలు కొడుతున్నాయి. మేము విద్యుత్‌ శాఖ విధులలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుంటాము. ఏప్రిల్‌, మే నెలలో ఉండే ఎండలు, ఈ నెల మార్చి ఆరంభంలోనే ఉన్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి బొండాల నీళ్లు ఎక్కువగా తాగుతున్నాము. - శివకుమార్‌, విద్యుత్‌శాఖ ఉద్యోగి, ఆదిలాబాద్‌ జిల్లా

ఈసారీ ముందుగానే ఎండకాలం సీజన్‌ ఆరంభమైంది. ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజలు కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ఇరవై రూపాయాల నుంచి విక్రయిస్తున్నాము. ఈసారీ గిరాకీ బాగానే ఉంది. -షేక్‌ నాసీర్‌, కొబ్బరి బొండాల వ్యాపారి, ఆదిలాబాద్‌ జిల్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.