ETV Bharat / state

సీసీఐ ఆశలు ‘తుక్కు’లోకి!.. పునరుద్ధరణ ఇక లేనట్లే..

author img

By

Published : May 17, 2022, 4:09 AM IST

సీసీఐ ఆశలు ‘తుక్కు’లోకి!.. పునరుద్ధరణ ఇక లేనట్లే..
సీసీఐ ఆశలు ‘తుక్కు’లోకి!.. పునరుద్ధరణ ఇక లేనట్లే..

Cement Corporation of India: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణ ఆశలు ఇక గల్లంతయ్యాయి. దశాబ్ధాల కిందట ఖాయిలాపడిన పరిశ్రమను పునరుద్దరించే ప్రయత్నం జరుగొచ్చని ఆశిస్తున్న తరుణంలో యంత్ర సామగ్రినంతా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండానే వేలం ప్రక్రియ ప్రారంభమైంది. సీసీఐ 'ఈ-వేలం' సహేతుకం కాదని.. దీనిని వ్యతిరేకిస్తామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Cement Corporation of India: ఆదిలాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిశ్రమ పునరుద్ధరణ ఆశలు గల్లంతయ్యాయి. దానిని పునఃప్రారంభించి ఉపాధిని కొనసాగించాలని, ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి సహకరించాలనే తెలంగాణ ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా ఆ సంస్థలోని యంత్రసామగ్రిని తుక్కు (స్క్రాప్‌) కింద కేంద్రం వేలం వేయనుంది. సంస్థ ప్రైవేటీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రక్రియను ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఈ-వేలం: రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ సీసీఐతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రెండు యూనిట్లు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో యూనిట్‌లోని యంత్రసామగ్రి, ఇతర నిల్వలతో పాటు తుక్కు, టౌన్‌షిప్‌లలోని క్వార్టర్లను కూలగొట్టి దాని సామగ్రిని తీసుకెళ్లడం, సీసీఐ భూములు, భవనాల ఆస్తుల విలువ అంచనావేయడం (వాల్యుయేషన్‌) వంటి అంశాలతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ-టెండర్లను పిలిచింది. ఈ నెల అయిదో తేదీ నుంచి టెండర్లను స్వీకరిస్తోంది. దాఖలుకు 23 వరకు గడువు విధించింది. అదే రోజు టెండర్లను తెరుస్తామని.. ఖరారైన 120 రోజుల్లో మొత్తం బిడ్డింగు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.

38 ఏళ్ల చరిత్ర: 1984లో రూ.47 కోట్ల పెట్టుబడితో ఆదిలాబాద్‌ పట్టణ శివార్లలోని 772 ఎకరాల ప్రాంగణంలో సీసీఐ ప్రారంభమైంది. దీంతో పాటు 400 క్వార్టర్లతో 170 ఎకరాల సీసీఐ టౌన్‌షిప్‌ను కేంద్రం నిర్మించింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్‌ టన్నుల లైమ్‌ స్టోన్‌ నిల్వలు, 2 కేవీఏ విద్యుత్తు సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి వనరులు అందుబాటులో ఉన్నా... నష్టాల సాకుతో కేంద్ర ప్రభుత్వం 2008లో దీనిని మూసి వేసింది. తద్వారా అయిదువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమ పునరుద్ధరణకు సన్నాహాలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. గత, ప్రస్తుత కేంద్ర భారీ పరిశ్రమల శాఖల మంత్రులు అనంత్‌గీతె, మహేంద్రనాథ్‌ పాండేలను పలు దఫాలు స్వయంగా కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. లేఖలు రాశారు. ఆ పరిశ్రమ పునఃప్రారంభమైతే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంటు సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో కంపెనీని తిరిగి ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని, నూతన పరిశ్రమలకిచ్చే మాదిరే అన్ని ప్రోత్సాహకాలను ఇస్తుందన్నారు.

అమ్మకానికి ఆరంభం: కేంద్రం పిలిచిన తాజా టెండర్లను అనుసరించి ఇది అమ్మకం ప్రక్రియను ఆరంభించినట్లుగా కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. యంత్రసామగ్రి, సిబ్బంది క్వార్టర్లను కూల్చివేయడం, ఆస్తుల విలువలను మదించడం వంటివి ఇందుకోసమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ-వేలం పూర్తయిన తర్వాత విలువైన భూములు, భవనాల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

సహేతుకం కాదు: ప్రభుత్వ వర్గాలు

సీసీఐ ఆదిలాబాద్‌ పరిశ్రమలో ఈ-వేలం గురించి తమకు ఏ మాత్రం సమాచారం లేదని, పునరుద్ధరణ గురించి ఎన్ని లేఖలు రాసినా దానిని సమాధానం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ-వేలం ఏ మాత్రం సహేతుకం కాదని, దీనిని వ్యతిరేకిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి.

రూ. రెండువేల కోట్ల ఆర్థిక మద్దతిచ్చినా: తెలంగాణలో నిర్మాణ రంగం పురోగతిలో ఉందని.. సిమెంట్‌ కంపెనీల లాభాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయని.. ఈ తరుణంలో సీసీఐ పునరుద్ధరణ లాభదాయకంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రూ. రెండువేల కోట్ల ఆర్థిక మద్దతుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌ దీనిపై మూడు దఫాలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్‌లోని ప్రజాప్రతినిధులు దీక్షబూనారు. అయినా కేంద్రం స్పందించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.