ETV Bharat / state

"పాకిస్తాన్​ వాళ్లు సైతం మన జెండాలతోనే సరిహద్దులు దాటారు"

author img

By

Published : Mar 4, 2022, 7:44 PM IST

Adilabad Student From Ukraine: ఉన్నత చదువుల కోసం దేశాలు దాటి.. పరాయిదేశంలో అడుగుపెట్టి.. యుద్ధ వాతావరణంలో చిక్కుకుని.. విలవిల్లాడిపోయారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి భారత్​కు చేరేంతవరకు.. క్షణక్షణం ఉత్కంఠతో గడిపారు. జాతీయ జెండాలు పట్టుకుని.. నిద్రాహారాలు మాని ఓ దీక్ష చేసినట్లుగా మాతృభూమిపై అడుగుపెట్టేందుకు రోజుల పాటు ప్రయాణం చేశారు. ఎట్టకేలకు వారి శ్రమ, తల్లిదండ్రుల ఎదురుచూపులు ఫలించి.. సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు.

telugu students in ukraine
ఉక్రెయిన్​లో తెలుగు విద్యార్థులు

Adilabad Student From Ukraine: ఉక్రెయిన్‌ దేశం నుంచి విడతల వారీగా భారతీయ విద్యార్థులు దేశం బాటపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ పట్టణం ద్వారకనగర్‌కి చెందిన అల్లూరి రోహన్‌రెడ్డి సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వినీస్టియాలో ఎంబీబీఎస్​ చదువుతున్న రోహిత్​.. యుద్ధ భూమిపై చిక్కుకుని క్షణక్షణం భయంభయంగా గడిపినట్లు పేర్కొన్నారు. యుద్ధ దేశం నుంచి భారత్​కు తనెలా ప్రయాణం చేశాడో రోహన్‌ వివరించారు. మన దేశ జాతీయ జెండా చేతిలో ఉన్నందునే తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఇతర దేశాల ఎంబసీలు.. వారి వారి పౌరులను పట్టించుకోకపోతే మన దేశ జెండాతో సరిహద్దులు దాటారని గర్వంతో చెప్పుకొచ్చారు. భారతీయులను క్షేమంగా తరలించిన ఇండియన్​ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కుమారుడి రాకతో ఇంటిల్లిపాదీ సంబరాలు చేసుకున్నారు.

ఇతర దేశస్థులు సైతం మన జెండాలతోనే సరిహద్దులు దాటారు: రోహన్​ రెడ్డి

ఎంతో భయపడ్డాం

రోహన్​ తిరిగి రావడం పట్ల తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఉక్రెయిన్​లో యుద్ధ పరిస్థితుల్లో తమ బిడ్డ ధైర్యం ఇచ్చినా.. ప్రతీక్షణం భయంతో గడిపామని గుర్తు చేసుకున్నారు. తామైతే ఎంతో భయపడ్డామని, బాబు వస్తాడో రాడో అనుకున్నామని కుటుంబీకులు ఉద్వేగానికి లోనయ్యారు. సురక్షితంగా తిరిగి వచ్చిన తమ బిడ్డకు స్వీట్​ తినిపించి సంబరాలు చేసుకున్నారు. రోహన్​ రాకతో కుటుంబీకులు, బంధుమిత్రులతో ఇల్లు సందడిగా మారింది.

"యుద్ధం సమయంలో పరిస్థితులు చాలా క్లిష్టతరంగా ఉన్నాయి. సైరన్లు మోగినప్పుడు బేస్​మెంట్లు, బంకర్లలోకి వెళ్లేవాళ్లం. అక్కడి నుంచి రావడానికి యూనివర్సిటీ వాళ్లు మాకు బస్సు సదుపాయం కల్పించారు. సరిహద్దులు దాటాక ఇండియన్​ ఎంబసీ వాళ్లు మమ్మల్ని రిసీవ్​ చేసుకుని వసతి కల్పించారు. బస్సులో వచ్చేటప్పుడు మన జాతీయ పతాకం తీసుకుని వచ్చాం. టర్కీ, పాకిస్తాన్​ వాళ్లు.. వాళ్ల ఎంబసీ వాళ్లు సహాయం చేయడంలేదని మన జెండా పట్టుకుని వచ్చారు." -రోహన్​ రెడ్డి, వైద్యవిద్యార్థి, ఆదిలాబాద్​

ఇదీ చదవండి: 'బయటకు వచ్చిన కాసేపటికే బాంబుల మోత.. 150 కిలోమీటర్లు నడిచే వచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.