ETV Bharat / sports

serena williams: సెరెనా '24'వ టైటిల్ కల నెరవేరుతుందా?

author img

By

Published : May 28, 2021, 6:50 AM IST

స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్.. ఫ్రెంచ్​ ఓపెన్​ సన్నద్ధమవుతోంది. ఇందులో గెలిచి, 24వ గ్రాండ్​స్లామ్ టైటిల్​ సొంతం చేసుకోవాలనుకున్న ఆమె కల నెరవేరుతుందా? లేదా అనేది ఇప్పుడు టెన్నిస్ అభిమానులకు వస్తున్న సందేహం.

serena williams eyes on 24 grand slam title
సెరెనా విలియమ్స్

తిరుగులేని ఆధిపత్యంతో ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసింది సెరెనా విలియమ్స్‌. తన ఆటతో, పోరాట పటిమతో ఎంతో కీర్తిని మూటగట్టుకున్న ఈ దిగ్గజం... ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కానీ ఆ ఒక్కటి ఆమెను ఊరిస్తోంది. అందకుండా అసహనానికి గురి చేస్తోంది. అదే 24 వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే! కెరీర్‌ ముగింపునకు దగ్గర్లో ఉన్న ఆమె ఆ ఒక్కటి అందుకోగలదా? అని.

మహిళల టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా (23 టైటిళ్లు) ఇప్పటికే ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మార్గరెట్‌ కోర్ట్‌ (24)కు చేరువైంది. ఇంకొక్కటి సాధిస్తే మార్గరెట్‌ సరసన నిలువనుంది. కానీ ఆ రోజు కోసం ఆమె నాలుగేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. 1999లో తొలి మేజర్‌ గెలిచిన సెరెనా.. 2002 తర్వాత ఎప్పుడూ గ్రాండ్‌స్లామ్‌ కోసం ఇంతగా ఎదురుచూడలేదు. గరిష్టంగా ఏడాది విరామం వచ్చిందంతే. పవర్‌ టెన్నిస్‌తో ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన ఆమె అన్ని కోర్టుల్లోనూ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. 2017 జనవరిలో గర్భంతోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను చేజిక్కించుకుంది. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కోసం విరామం తీసుకోవడం వల్ల ఆమె కెరీర్‌ మరో దశలో అడుగుపెట్టింది. ఆ ఏడాది సెప్టెంబరులో తల్లి అయిన అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆమె ఆరు వారాలు పాటు మంచానికే పరిమితమైంది. మొత్తంగా ఎనిమిది నెలల విరామం తర్వాత డిసెంబరులో తిరిగి ఆడడం మొదలుపెట్టింది. తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నా.. సెరెనా తిరిగి ఎప్పుడూ తన పూర్వపు ఫామ్‌ను అందుకోలేకపోయింది. 2018 నుంచి నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ చేరిన ఆమె.. అన్నిసార్లూ ఓడిపోయింది. గాయాలు, కుంగుబాటు కూడా ఆమెకు ప్రతిబంధకాలు మారాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత కూడా గాయంతో దాదాపు మూడు నెలల ఆటకు దూరం కావడం ఆమె ఫామ్‌ను దెబ్బతీసింది.

serena williams eyes on 24 grand slam title
సెరెనా విలియమ్స్

24 సాధిస్తుందా?

కెరీర్‌ చరమాంకంలో ఉన్న సెరెనా.. ఆ ఒక్క గ్రాండ్‌స్లామ్‌ను అందుకునే అవకాశమెంత? కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన సెరెనాను ఎప్పుడూ అంత తేలిగ్గా పక్కన పెట్టలేం. ఇప్పటికీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉంది. చాలా మంది క్రీడాకారిణులతో పోలిస్తే సెరెనా ఇప్పటికీ ఫిట్‌నెస్‌ పరంగా మెరుగైన స్థితిలో ఉందనడంలో సందేహం లేదు. కానీ ఆమె ఆటలో ఒకప్పటి పదును తగ్గింది అన్నది కూడా నిజమే. అదే సమయంలో వయసు కూడా ఆమె వైపు లేదు. సెప్టెంబరులో 40 నిండబోతున్నాయి. కొన్నేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఒసాకా వంటి వారి రూపంలో అత్యంత బలమైన యువ ప్రత్యర్థులు ఉన్నారు. పైగా మూడు నెలల విరామం తర్వాత ఇటీవలే తిరిగి కోర్టులో అడుగుపెట్టిన సెరెనా ఫ్రెంచ్‌ ఓపెన్‌ సన్నద్ధత పేలవం. పునరాగమనంలో ఆడిన రెండు టోర్నీల్లో ఒక్క మ్యాచే నెగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో రొలాండ్‌ గారోస్‌లో సెరెనా నెగ్గాలంటే చాలా కష్టపడాల్సిందే. 2016 తర్వాత ఆమె అక్కడ నాలుగో రౌండే దాటలేదు. బహుషా ఆమెకు ఇదే ఆఖరి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కావొచ్చు. వచ్చే ఏడాది 41వ ఏట సెరెనా గ్రాండ్‌స్లామ్‌ కొట్టడమనేది సాధ్యమవుతుందని అనుకోలేం. కాబట్టి వాస్తవికంగా ఆలోచిస్తే.. సెరెనా 24 కల నెరవేరుతుందా లేదా అన్నది వచ్చే వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ తేల్చేస్తాయన్నమాట.

ఇది చదవండి: ఉమెన్స్ డే: ఈ 'అమ్మ'లకు ఎవరూ సాటిరారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.